BRS Party: ఈనెల 10న సీఎం కేసీఆర్ కీలక పార్టీ సమావేశం.. తెలంగాణ రాజకీయాలలో ఉత్కంఠ!

Kaburulu

Kaburulu Desk

March 8, 2023 | 11:17 PM

BRS Party: ఈనెల 10న సీఎం కేసీఆర్ కీలక పార్టీ సమావేశం.. తెలంగాణ రాజకీయాలలో ఉత్కంఠ!

BRS Party: తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 10న తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కమిటీతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు, జడ్పి ఛైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ ఛైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ ఛైర్మన్లకు కూడా ఆహ్వానాలు అందాయి. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శ్రేణులను సమాయత్తం చేసేందుకు కేసీఆర్ ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే, తెలంగాణ రాజకీయాలలో ఢిల్లీ లిక్కర్ స్కాం కాకరేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇవ్వగా.. ఈడీ ఆమెను విచారించేందుకు సిద్ధమవుతుండటం.. మరోవైపు ఆమె ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో దీక్ష చేసేందుకు హస్తిన బాట పట్టిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మరవైపు అంతకు ముందు రోజు అంటే రేపు తెలంగాణ మంత్రి వర్గం సమావేశం కూడా జరగనున్న నేపథ్యంలో ఎల్లుండి పార్టీ సమావేశంపై తీవ్ర ఉత్కంఠ మొదలైంది.

ఈ సమావేశాల వెనుక గులాబీ బాస్ వ్యూహం ఏదైనా ఉందా అన్న చర్చ తెలంగాణ రాజకీయ వర్గాలలో మొదలైంది. మరోవైపు, కవిత ఢిల్లీకి బయలుదేరారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. ఎల్లుండి ధర్నా కార్యక్రమం కోసం ఆమె ఢిల్లీ చేరుకున్నారు. ఒకవైపు కవిత ఢిల్లీలో ధర్నాకు పూనుకోవడం, ఈడీ నోటీసులతో హీట్ రగులుతుండగానే.. సీఎం కేసీఆర్ వరుసగా.. కేబినెట్ భేటీ, పార్టీ కీలక సమావేశం ఏర్పాటు చేయటం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు.. పార్టీ కార్యకలాపాలు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చ సాగే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఇక, ఆహ్వానితులు ప్రతీఒక్కరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ వర్గాలలో చర్చ నడుస్తుంది.