Sr NTR: నేడు ఎన్ఠీఆర్ వర్ధంతి.. తాతకి నివాళులు అర్పించిన మనవళ్లు

Kaburulu

Kaburulu Desk

January 18, 2023 | 09:05 AM

Sr NTR: నేడు ఎన్ఠీఆర్ వర్ధంతి.. తాతకి నివాళులు అర్పించిన మనవళ్లు

Sr NTR: రాముడు.. కృష్ణుడు. ఏడుకొండల వెంకన్నా.. పోతులూరి వీరబ్రహ్మన్న.. ఇలా ఏ పాత్ర ఆయన చేస్తే ఆ పాత్రకు నిండుదనం. అంతేకాదు రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ముఖ్యమంత్రిగా అనితర సాధ్యుడు అనిపించుకున్న మహానటుడు ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి నేడు.

ఈ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న ఎన్టీఆర్ మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌ తాత సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. తాతతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

మనవళ్లు తారక్, కళ్యాణ్ రామ్ తో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించారు. అయితే.. తారక్‌ ఎన్టీఆర్ ఘాట్‌ దగ్గరకు వచ్చిన సమయంలో మాత్రం ఫ్యాన్స్‌ అంతా సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభలు, ర్యాలీల్లో జూనియర్‌ ఎన్టీఆర్ సీఎం అవ్వాలనే స్లోగల్స్‌ అప్పుడప్పుడూ వినిపించేవే కాగా ఇప్పుడు వర్థంతి వేళ కూడా ఈ స్లొగన్స్ ఆసక్తిగా మారాయి. ఎవరెంత స్లొగన్స్ ఇచ్చినా తారక్ మాత్రం మౌనంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు.

ఇక, మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను భారీగా నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు సన్నాహాలు చేసుకున్నారు. ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించేందుకు పార్టీ కార్యకర్తలు సమాయత్తమవగా.. అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, పల్లె, పట్టణం అన్నిచోట్లా అన్నదానం.. ఇతరత్రా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ వర్దంతిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడిక్కడ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన అభిమానులు.. ఎన్టీఆర్ సేవలను స్మరించుకోని కొనియాడుతున్నారు. ఇక, ఉదయం 11 గంటలకు టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ కు నివాళి అర్పించనున్నారు.