Varupula Raja: గుండెపోటుతో టీడీపీ నేత వరుపుల రాజా హఠాన్మరణం.. తీరని లోటని చంద్రబాబు విచారం!

Kaburulu

Kaburulu Desk

March 5, 2023 | 03:50 PM

Varupula Raja: గుండెపోటుతో టీడీపీ నేత వరుపుల రాజా హఠాన్మరణం.. తీరని లోటని చంద్రబాబు విచారం!

Varupula Raja: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా (46) హఠాన్మరణం చెందారు. శనివారం రాత్రి 9 గంటలకు గుండెపోటు రావడంతో హుటాహుటిన కాకినాడలో సూర్య గ్లోబల్‌ ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో స్థానిక అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోవడంతో అర్ధరాత్రి 11 గంటలకు రాజా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

కాగా, వరుపుల రాజాకు ఐదేళ్ల కిందట ఒకసారి గుండెపోటు రాగా.. అప్పట్లో వైద్యులు స్టంట్‌ వేశారు. ఆ తర్వాత తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉన్నా.. కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం విజయనగరం జిల్లా సాలూరు, బొబ్బిలి నియోజకవర్గాల పరిశీలకుడిగా రాజా అక్కడ పనిచేస్తున్నారు. శనివారం పార్టీ కార్యక్రమాల కోసం సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు రాగా గుండెపోటుతో మృతిచెందారు.

టీడీపీ నేత వరుపుల రాజా హఠాన్మరం విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వరుపుల రాజా మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన చంద్రబాబు.. ప్రత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ ఎదుగుదలకు ఆయన ఎంతగానో కష్టపడ్డారని గుర్తు చేశారు. ఉజ్వల భవిష్యత్ ఉన్న నాయకుడిని టీడీపీ కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందిస్తూ.. ఆత్మీయ స్నేహితుడిని కోల్పోయానని అన్నారు. వరుపుల రాజా ఆకస్మిక మృతి షాక్ కి గురి చేసిందని చెప్పారు. తెలుగుదేశం కుటుంబం యువ నేతను కోల్పోయిందన్న ఆయన.. బాధాతప్త హృదయంతో నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు‌. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉన్న రాజా మృతి టీడీపీకి తీరని లోటుగా చెప్పారు. వారి కుటుంబసభ్యులకు లోకేష్ తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.