Stalled Wedding: కట్నం కింద పాత మంచం ఇచ్చారని పెళ్ళికి నో చెప్పిన పెళ్లి కొడుకు!

Kaburulu

Kaburulu Desk

February 20, 2023 | 11:36 AM

Stalled Wedding: కట్నం కింద పాత మంచం ఇచ్చారని పెళ్ళికి నో చెప్పిన పెళ్లి కొడుకు!

Stalled Wedding: పెళ్లంటే జీవితంలో ఓ మరపురాని ఘట్టం. ఎవరికి వారు వారి వారి ఆచారాల ప్రకారం.. బంధుమిత్రులు, పెద్దల సమక్షంలో వారి ఆశీస్సులతో ఒక్కటవుతారు. పెళ్లి అంటే ఇద్దరు మనుషులను, మనసులను ఒక్కటి చేసేది. ఈ వివాహాలు తమ స్థాయికి తగ్గట్లు రక రకాల పద్దతుల్లో చేస్తుంటారు. ఒకప్పుడు పెళ్లి అంటే కట్నాలు, కానుకలదే పెద్ద అంశం. ఇప్పటికీ కొందరు కట్న, కానుకల విషయంలో పంతాలకు పోతుండగా.. అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లో ముందుండడంతో కట్నం డిమాండ్ అంశం మరుగున పడుతుంది.

కాగా.. అప్పుడప్పుడు పెళ్లి భోజనంలో వంటల దగ్గర, పెళ్లి బట్టల దగ్గర, కానుకల విషయంలో పంతాలకు పోయి పెళ్లి రద్దు చేసుకున్న ఘటనలు చూస్తుంటాం. హైదరాబాద్ చాంద్రాయణగుట్లో కూడా అలాంటి ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి కానుకగా తనకు పాత మంచం ఇచ్చారని పెళ్లికి వరుడు డుమ్మాకొట్టాడు. చాంద్రాయణగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలికి చెందిన మహ్మద్‌ జకారియా స్కూలు బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బండ్లగూడ రహమత్‌ కాలనీకి చెందిన యువతితో జకారియాకు పెళ్లి కుదిరింది.

ఈ నెల 13న బండ్లగూడలో వధువు ఇంటి వద్ద నిశ్చితార్థం జరిగగా.. ఆదివారం మధ్యాహ్నం స్థానిక మసీదులో నిఖా జరగాల్సి ఉంది. వధువు కుటుంబీకులు శనివారం సాయంత్రం మంచం, ఇతర ఫర్నిచర్ ను కానుకగా వరుడి ఇంటికి పంపారు. మంచం విడి భాగాలను జోడిస్తుండగా అవి విరిగిపోయాయి. పాత మంచానికి రంగులు వేసి పంపారని భావించిన జకారియా అత్తింటివారిపై కోపం పెంచుకున్నాడు. నిఖా సమయానికి పెళ్లి కొడుకు రాకపోవడంతో వధువు తండ్రి వరుడి ఇంటికి వెళ్లారు.

పెళ్లి సందర్భంగా తనకు పాత మంచం ఎందుకు ఇచ్చారంటూ జకారియా వధువు తండ్రిపై గొడవపడి నిఖాకు రానని చెప్పాడు. వరుడి తల్లి రహమతున్నిసా బేగం సైతం వధువు తండ్రితో గొడవపడింది. దీంతో వధువు తండ్రి పెళ్లి కొడుకు జకారియాతో పాటు తల్లి రహమతున్నిసా బేగంపై బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఫోన్‌ తో వరుడు పెళ్లికి సిద్ధమేనని చెప్పినా వధువు తండ్రి మాత్రం ఇప్పుడే ఇలా ఉంటే పెళ్లి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయోనని పెళ్ళికి నిరాకరించారు. అంతేకాదు వరుడి కుటుంబ సభ్యులపై పోలీసు కేసు కూడా నమోదయ్యేలా చేశాడు.