RK Roja: వయసు పెరిగినా.. ఎమ్మెల్యే అయినా తీరు మారడం లేదు.. బాలయ్యపై మంత్రి రోజా!

Kaburulu

Kaburulu Desk

January 25, 2023 | 04:51 PM

RK Roja: వయసు పెరిగినా.. ఎమ్మెల్యే అయినా తీరు మారడం లేదు.. బాలయ్యపై మంత్రి రోజా!

RK Roja: నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి రోజా మండిపడ్డారు. అక్కినేనిపై బాలయ్య వ్యాఖ్యలను తప్పుబట్టిన రోజా.. బాలయ్యకు వయసు పెరిగినా, ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచినా ఆయన తీరు మారడం లేదని మంత్రి రోజా ఆరోపించారు. బాలయ్య వ్యాఖ్యల వల్ల అక్కినేని అభిమానులు బాధపడ్డారని రోజా అన్నారు. ఇవే వ్యాఖ్యలు ఎన్టీఆర్‌పై చేస్తే ఎలా ఉంటుందో బాలయ్య ఆలోచన చేయాలని సూచించారు.

అసలేం జరిగిందంటే..
బాలయ్య నటించిన లేటెస్ట్ చిత్రం వీర సింహా రెడ్డి. ఈ సినిమాతో బాలకృష్ణ మరోసారి సంక్రాంతి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో సినిమా యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడుతూ.. వేదికపై ఉన్న జయరాం అనే ఆర్టిస్ట్‌ గురించి చెబుతూ ‘ఇక ఈయన ఉన్నారంటే సెట్‌లో నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకుంటుండే వాళ్లం’ అంటూ పుసుక్కున నోరు జారిపోయారు.

బాలయ్య అన్న మాటలను కొందరు కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు. అక్కినేని హీరోలు కూడా బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు. ‘నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అలాగే ఎస్వీ రంగారావు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరచుకోవడం’ అంటూ అక్కినేని నాగచైతన్య ట్వీట్ చేశారు. అటు అఖిల్ అక్కినేని కూడా సేమ్ టు సేమ్ ఇదే ట్వీట్ చేశారు.

ఒకపక్క బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు మండిపడుతుంటే.. మరోపక్క రాజకీయాలలో బాలయ్య ప్రత్యర్థులు కూడా ఇదే అంశాన్ని ఎత్తుకొని విమర్శలు చేస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రోజా అటు ఏఎన్నార్ తో పాటు నాగార్జున, బాలయ్యతో కూడా కలిసి నటించగా.. ఇప్పుడు బాలయ్య వ్యాఖ్యలపై స్పందించి ఘాటు విమర్శలు చేశారు.