AP Govt: ఉద్యోగులకు జీతాల ఆలస్యం.. ఎట్టకేలకి స్పందించిన ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి!

Kaburulu

Kaburulu Desk

January 22, 2023 | 11:18 AM

AP Govt: ఉద్యోగులకు జీతాల ఆలస్యం.. ఎట్టకేలకి స్పందించిన ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి!

AP Govt: ఏపీలో ఉద్యోగుల జీతాల చెల్లింపు ఆలస్యంపై రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ప్రభుత్వం జీతాలు సకాలంలో ఇవ్వాలని, ఈ మేరకు చట్టం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ ఉద్యోగ సంఘం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి విన్నవించుకున్నారు. ఎన్ని సార్లు అడిగినా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఉద్యోగ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఇప్పటికే పేరుకుపోయిన కోట్లాది రూపాయల బకాయిలు, పెన్షన్ల చెల్లింపుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలని, లేకపోతే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఓ ఉద్యోగ సంఘం వినతి పత్రం ఇచ్చారు. ప్రతినెలా చివరి వరకు జీతాలు పడుతునే ఉంటాయని, పెన్షన్ల పరిస్థితి కూడా అలాగే ఉందని.. ఈ అంశాలన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి కోరామని ఉద్యోగ నేతలు ప్రకటించారు.

అంతేకాదు ఉద్యోగుల అనుమతి లేకుండానే 90 వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి జీపీఎస్ డబ్బులు విత్ డ్రా చేశారని.. మేం ప్రశ్నిస్తే సాంకేతిక సమస్య వల్ల జరిగిందని అధికారులు చెబుతున్నారని.. ఇవన్నీ గవర్నర్ కు వివరించామని చెప్పారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వడంలో విఫలమైందని.. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుండి అనుమతి లేకుండా డబ్బును విత్‌డ్రా చేస్తోందని ఆరోపించారు.

దీనిపై గత నాలుగైదు రోజులుగా రగడ జరుగుతుండగా.. మంత్రులు దీనిపై స్పందించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే.. ఇప్పటి వరకు ఆ శాఖలకు సంబంధించిన అధికారులెవరూ స్పందించకపోగా.. తాజాగా ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ స్పందించారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం, కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని అందుకే జీతాలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు.

అయితే, ప్రతి నెల 5వ తేదీనాటికే 90 నుంచి 95 శాతం వేతనాలు, పింఛన్లను చెల్లిస్తున్నట్టు పేర్కొన్న ఆయన.. మిగిలిన 5 శాతం మందికి ఖజానా ఆధారంగా చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. రిజర్వ్ బ్యాంకు, బ్యాంకుల సెలవులు, రాష్ట్రంలో నిధులు, అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా చెల్లింపులు జరుగుతున్నట్టు రావత్ చెప్పారు. మరి.. దీనిపై ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.