District YSR: గురుకుల పాఠశాలలో దారుణం.. బిడ్డకి జన్మనిచ్చిన 9 తరగతి బాలిక

District YSR: గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అభం శుభం తెలియని ఓ 14 ఏళ్ల బాలిక మగ బిడ్డకి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఆరోగ్యం నిలకడగానే ఉండగా.. మెరుగైన చికిత్స కోసం ఇద్దరినీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. గురుకుల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలిక ప్రసవించడం స్థానికంగా కలకలం రేపింది. వైఎస్ఆర్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.
వైఎస్ఆర్ జిల్లా వాల్మీకిపురంలో ఉన్న గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక బాలిక ప్రసవించింది. బాధితురాలికి శనివారం సాయంత్రం విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. నొప్పిని భరించలేకపోతున్న ఆమెను చూసిన పాఠశాల సిబ్బంది దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడి వైద్యులు ఆమె గర్భవతి అని నిర్ధారించడంతో అందరూ షాక్ తిన్నారు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే ఆ బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది.
అప్పటికే గురుకుల పాఠశాల నిర్వాహకులు బాలిక గర్భవతి అనే విషయాన్ని స్థానిక తహసీల్దార్ ఫిరోజ్ ఖాన్, ఎస్సై బిందుమాధవికి తెలియజేశారు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలివచ్చిన వారు బాలిక పరిస్థితిపై దర్యాప్తు చేసి ఆమెను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ ఘటనను జిల్లా కలెక్టర్ వి విజయ రామరాజుకు తెలియజేయగా ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు.
మరోవైపు బాధితురాలు గర్భం దాల్చడానికి కారణాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే బాలిక మేనమామనే గర్భం దాల్చడానికి కారణం అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా అభం శుభం తెలియని బాలిక, నిండా 14 ఏళ్ళు లేని బాలిక.. మరో ప్రాణిని భూమి మీదకి తీసుకురావడం స్థానికంగా సంచలనంగా మారింది. ఇదే సమయంలో బాలికకి 9 నెలలు నిండేవరకు కూడా గురుకులం హాస్టల్ లో కానీ.. అటు పాఠశాలలో కానీ నిర్వాహకులు ఆమెని గమనించకపోవడంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.