TDP-Janasena: చంద్రబాబుతో పవన్ భేటీ.. పొత్తులపై క్లారిటీ ఇస్తారా?

Kaburulu

Kaburulu Desk

January 8, 2023 | 01:19 PM

TDP-Janasena: చంద్రబాబుతో పవన్ భేటీ.. పొత్తులపై క్లారిటీ ఇస్తారా?

TDP-Janasena: ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ హీట్ పెంచేస్తున్నాయి. రానున్న ఎన్నికల కోసం ఎవరు ఎవరితో పొత్తుకు వెళ్తారు అన్నదానిపై ఎప్పటికప్పుడు హాట్ చర్చలు మొదలవుతున్నాయి. అందుకు అనుగుణంగా పార్టీ అధినేతలు కూడా భేటీలు షురూ చేయడం ఇక్కడ రాజకీయాలకు మరింత ఊపు తెస్తుంది. ముఖ్యంగా టీడీపీ-జనసేన పార్టీల పొత్తుపై ఉత్కంఠ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన టీడీపీతో పొత్తు కోసం తహతహలాడుతుంది.

పవన్ కళ్యాణ్ ఇప్పటికే పరోక్షంగా పొత్తు సిద్దమే అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తేలేదని.. దాని కోసం ఒక మెట్టు కిందకి దిగేందుకు కూడా తాను సిద్ధమేనని పవన్ ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. అయితే.. అది బీజేపీతో పాటు టీడీపీతో పొత్తు ఉంటుందా.. బీజేపీని కాదని టీడీపీతో జత కడతారా అన్నది ఉత్కంఠగా మారింది. అలాంటి సమయంలోనే పవన్ చంద్రబాబుతో భేటీ కావడం ఆసక్తిగా మారింది.

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 1తో కుప్పంలో చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వలేదు. అయినా వెనకడుగేయని చంద్రబాబు కుప్పం వెళ్లారు. అక్కడ పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు జగన్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. పోలీసులపైన ఫైర్ అయ్యారు. చిత్తూరు జిల్లాలో పలుచోట్ల వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షలు కూడా చోటు చేసుకున్నాయి.

కాగా.. ఇలాంటి వేడి పరిస్థితులలోనే పవన్ చంద్రబాబు ఇంటికి వెళ్లారు. గతంలో విశాఖలో పవన్ ను అడ్డుకుకోవడం తరువాత చంద్రబాబు కూడా స్వయంగా వెళ్లి పవన్ కు సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడు పవన్ కూడా కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాలతో చంద్రబాబుకు అండగా నిలవాలని నిర్ణయించారు. ఇప్పటికే కుప్పం ఘటనలపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు అస్పష్టంగా ఉన్న పొత్తులపై క్లారిటీ వస్తుందా అన్న చర్చలు మొదలయ్యాయి. ఔనన్నా కాదన్నా.. ఇద్దరు నేతలు పొత్తులపై చర్చించడం ఖాయం. కనుక ఇద్దరి నేతల నుండి ఎలాంటి ప్రకటనలు వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.