TDP: నరసరావుపేట టీడీపీలో కొత్త లొల్లి.. అధిష్టానానికి రాయపాటి హెచ్చరికలు

Kaburulu

Kaburulu Desk

January 24, 2023 | 01:20 PM

TDP: నరసరావుపేట టీడీపీలో కొత్త లొల్లి.. అధిష్టానానికి రాయపాటి హెచ్చరికలు

TDP: గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగు దేశం పార్టీలో కొత్త లొల్లి మొదలైంది. నరసరావుపేట ఎంపీ టికెట్ కొత్త వాళ్లకి ఇవ్వనున్నారని పార్టీలో ప్రచారం జరుగుతుండడంతో అక్కడ సిట్టింగ్ క్యాండిడేట్, పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు అలెర్ట్ అయ్యారు. కొత్తవాళ్ళని ఇక్కడకి తీసుకొస్తే సహకరించేది లేదని.. ఓడించి పంపిస్తామని కూడా రాయపాటి అధిష్టానానికి బహిరంగంగానే హెచ్చరికలు జారీచేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కార్యాచరణ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఇంఛార్జ్‌లు లేనిచోట కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు. కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ సీటుపై ఫోకస్ పెట్టారు. 2009, 2014లో టీడీపీ విజయం సాధించగా.. 2019లో మాత్రం ఓటమి ఎదురైంది. ఈసారి ఎలాగైనా ఈ సీటు దక్కించుకోవాలని చూస్తున్న టీడీపీ ఇక్కడ కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు ప్రచారం మొదలైంది.

ఇక్కడ సిట్టింగ్ క్యాండిడేట్ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన రాజకీయ వారసుడ్ని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. అయితే నరసరావుపేటలో ఈసారి బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అది కూడా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కుమారుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మ‌హేష్ యాద‌వ్‌ను దింపాల‌ని భావిస్తున్నట్లు ఇక్కడ తీవ్ర ప్రచారం జరుగుతుంది.

గుంటూరు జిల్లాలోని గుర‌జాల‌, వినుకొండ‌, మాచర్ల నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో యాద‌వ సామాజిక‌వ‌ర్గం ఓట్లు ఎక్కువ‌గా ఉండడం కలిసి వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి రాయపాటి మాత్రం ససేమీరా కాదని అంటున్నారు. తాజాగా నారా లోకేష్ జన్మదిన వేడుకలకి హాజరైన రాయపాటి.. తన సీటు వేరే ఎవరికో ఇస్తానంటే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తనకు తెలియకుండా నరసరావుపేట సీటు వేరేవాళ్లకు ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తానన్నారు. తనకు కాదంటే.. తమ వారసుడు రంగబాబు పోటీ చేస్తాడని.. అంతేకాని నరసరావుపేట ఎంపీ సీటును కడప వాళ్లకు ఇస్తే తమ వర్గం సహకరించదన్నారు. మరి అధిష్టానం ఈ లొల్లిని ఎలా డీల్ చేస్తుందో చూడాలి.