Telangana Secretariat: సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. మరోసారి తెలంగాణకు జాతీయ నేతలు

Kaburulu

Kaburulu Desk

January 24, 2023 | 03:13 PM

Telangana Secretariat: సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. మరోసారి తెలంగాణకు జాతీయ నేతలు

Telangana Secretariat: నూతన సచివాలయ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 617 కోట్లతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో అధునాతనంగా ఈ భవన నిర్మాణం చేపట్టారు. లోపలికి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేశారు. ఎనిమిది అంతస్తులతో కూడిన భవనంలో ఆరో అంతస్తులో సీఎం సచివాలయం సిద్ధం చేశారు. ఇప్పటికే నిర్మాణం ముగింపు దశకు చేరుకున్న కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.

ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ సచివాలయాన్ని ప్రారంభిస్తారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గతంలోనే వెల్లడించారు. ఫిబ్రవరి 17న సీఎం పుట్టినరోజున కూడా కాగా అదే రోజు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల నడుమ సచివాలయాన్ని సీఎం ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయానికి డా.బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టిన విషయం తెలిసిందే.

ఈ కొత్త సచివాలయాన్ని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగా.. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సచివాలయం ప్రారంభానికి మరోసారి జాతీయ స్థాయి నేతలు తెలంగాణకి రానున్నారు. ఈ మధ్యనే ఖమ్మం బీఆర్ఎస్ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులతో పాటు మరికొందరు జాతీయ నేతలను అహ్వాయించిన సీఎం కేసీఆర్.. సచివాలయ నిర్మాణం కోసం మరోసారి జాతీయ స్థాయి నేతలను ఆహ్వానిస్తున్నారు.

నూతన సచివాలయం నిర్మాణానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్, బీహార్ నుండి జేడీయూ నేషనల్ ప్రెసిడెంట్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇక, ప్రారంభోత్స కార్యక్రమానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించనుండగా.. సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ సభ ఏర్పాటు చేయనున్నారు.