Mekathoti Sucharita: మాజీ హోంమంత్రి సుచరిత డ్రైవర్ ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?

Kaburulu

Kaburulu Desk

January 24, 2023 | 12:29 PM

Mekathoti Sucharita: మాజీ హోంమంత్రి సుచరిత డ్రైవర్ ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?

Mekathoti Sucharita: ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత ఎస్కార్ట్ డ్రైవర్ చెన్నకేశవరావు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా గుంటూరులోని బ్రాడీపేట 4వ లైన్‌లో ఓ గదిలో ఉంటున్న చెన్నకేశవరావు.. ఊహించని విధంగా సోమవారం రాత్రి తన గదిలో సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మాజీ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత నివాసానికి కొద్దిదూరంలో ఉన్న ఓ హాస్టల్‌లో ఆమె సెక్యూరిటీ సిబ్బంది, కారు డ్రైవర్లు రూమ్ తీసుకుని ఉంటున్నారు.

డ్రైవర్‌ చెన్నకేశవరావు ఎప్పటిలాగానే విధులు ముగించుకుని రూమ్‌కు రాగా.. అనంతరం పీఎస్‌వో రామయ్య కూడా రూంకి వచ్చారు. పీఎస్‌వో రామయ్య తన పిస్టల్‌ను తీసి దిండు కింద పెట్టి స్నానం చేసేందుకు వెళ్లాడు. రామయ్య అలా స్నానానికి వెళ్ళాడో లేదో ఇంతలో డ్రైవర్ చెన్నకేశవరావు ఆ పిస్టల్‌ తీసుకుని కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే రామయ్య గుంటూరు ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు.

సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చెన్నకేశవరావు మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులే చెన్నకేశవరావు బలవన్మరణానికి కారణం కావచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అలాగే కుటుంబంలో ఆస్తి గొడవలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తరచూ తనకు అప్పులు ఉన్నాయని చెప్పేవారిని.. వాటిని తీర్చలేకపోతున్నానని బాధపడేవారని సహచర సిబ్బంది అంటున్నారు.

మృతుడు చెన్నకేశవరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉండగా.. వీరి కుటుంబం గుంటూరు ఏటీ అగ్రహరంలో నివాసం ఉంటోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఎస్కార్ట్ డ్రైవర్ చెన్నకేశవరావు ఆత్మహత్యతో గుంటూరులో ఒక్కసారిగా కలకలం రేగింది. సిబ్బంది ఉండేది హాస్టల్ రూమ్ కావడం.. హాస్టల్ చుట్టుపక్కల నివాసాలు ఉండడంతో ఏం జరిగిందో అర్ధం కాక చుట్టుపక్కల ప్రజలలో ఆందోళన నెలకొంది. మంగళవారం ఉదయానికి కానీ పూర్తి సమాచారం బయటకి రాలేదు.