PM Modi: సంక్రాంతి తర్వాత తెలంగాణలో మోడీ పర్యటన.. కారణమేంటంటే?

Kaburulu

Kaburulu Desk

January 7, 2023 | 09:00 PM

PM Modi: సంక్రాంతి తర్వాత తెలంగాణలో మోడీ పర్యటన.. కారణమేంటంటే?

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ సంక్రాంతి తర్వాత తెలంగాణలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ శ్రేణులకు సూత్రప్రాయంగా తెలియజేసినట్లు తెలుస్తుంది. దక్షిణ మధ్య రైల్వేకు తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంజూరయిన విషయం తెలిసిందే. మనదేశంలో ఇప్పటి వరకు ఏడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించగా అవి మన రైల్వే ట్రాక్ మీద పరుగులు పెడుతున్నాయి. కాగా.. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఎనిమిదవ రైలు సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో పరుగులు పెట్టనుంది.

కాగా, ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ రైలు గరిష్ట వేగంకు అనుగుణంగా సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో ట్రాక్ సామర్థ్యాన్ని గంటకు 180 కి.మీ వరకు పెంచారు. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా మొదలవగా కొద్దిరోజులలోనే ఈ ట్రయల్ పూర్తవుతుంది. దీంతో సంక్రాంతి తర్వాత ఈ రైలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు మొదలవనున్నట్లు తెలుస్తుంది. ఈ రైలు ప్రారంభం కోసమే ప్రధాని మోడీ తెలంగాణకి వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు ప్రారంభమైన ఏడు వందే భారత్ రైళ్లను ప్రధాని మోడీనే స్వయంగా ప్రారంభించగా ఈ రైలు కూడా ఆయనే ప్రారంభించే ఛాన్స్ ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. జనవరి 19 లేదా 20న ఆయన హైదరాబాద్‌ వచ్చే అవకాశం ఉంది. ప్రధాని పర్యటనలో భాగంగా వందే భారత్ రైలు ప్రారంభంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసి అక్కడే ఆయన ప్రసంగించే అవకాశముంది.

ఇక మన తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రయాణించనున్న ఈ వందే భారత్ రైలు విషయానికి వస్తే.. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 52 సెకండ్లలో గంటకు 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇందులో ఆటోమెటిక్ డోర్స్, జీపీఎస్ బేస్డ్ ఆడియో విజువల్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్, వైఫై హాట్‌స్పాట్, ఎగ్జిక్యూటీవ్ క్లాస్ బోగీల్లో రొటేటింగ్ చైర్లు, బయోవ్యాక్యూమ్ టైప్ టాయిలెట్స్, దివ్యాంగులకు అనుకూలంగా వాష్‌రూమ్స్, సీట్ హ్యాండిల్‌కు, సీట్ నెంబర్స్‌కు బ్రెయిలీ లెటర్స్, ప్రతీ కోచ్‌కు ప్యాంట్రీ వంటి సదుపాయాలున్నాయి.