Vande Bharat Express: హైదరాబాద్‌కు మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఎక్కడి నుండంటే?

Kaburulu

Kaburulu Desk

January 22, 2023 | 12:52 PM

Vande Bharat Express: హైదరాబాద్‌కు మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఎక్కడి నుండంటే?

Vande Bharat Express: రాష్ట్రాల మధ్య, ప్రధాన నగరాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రప్రభుత్వం వందేభారత్ ఎక్స్ ప్రెస్ లను ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తు సంగతి తెలిసిందే. జనవరి 15 నుంచి తెలంగాణలోని సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఏపీలోని విశాఖపట్నం వరకూ ఒక వందే భారత్ రైలు ప్రారంభించారు. ఇది సికింద్రాబాద్ నుండి విశాఖ.. విశాఖ నుండి సికింద్రాబాద్ చక్కర్లు కొడుతోంది. తెలుగు ప్రజల నుండి ఈ రైలుకు విశేష ఆదరణ కూడా లభిస్తుంది.

కాగా.. ఇప్పుడు హైదరాబాద్ నగరానికి మరో వందే భారత్ రైలు రాబోతున్నట్లు తెలుస్తుంది. దేశంలోని ప్రధాన నగరాలలో ఒక్కటైన కర్నాటకకు ఈ వందేభారత్ రైలు సర్వీసు వచ్చే అవకాశం ఉంది. బెంగళూరు నుండి దేశంలోని మరో ప్రధాన నగరమైన హైదరాబాద్ కు ఈ వందే భారత్ రైలును ప్రారంభించాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. హైదరాబాద్‌- విశాఖపట్నం నగరాల మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు డిమాండ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి మరో మూడు వందే భారత్‌లు నడిపేందుకు ఇండియన్‌ రైల్వేస్‌ ఆలోచిస్తున్నట్లు ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు.

అందులో ఒకటి హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రారంభించనున్నట్లు చెప్తున్నారు. ఈ వందే భారత్ రైలు బెంగళూరు నుండి హైదరాబాద్ సమీపంలోని కాచిగూడ మధ్య నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే ఒక నోటిఫికేషన్ ద్వారా తెలిపింది. ఇప్పటికే కర్ణాటకలో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మైసూర్-బెంగళూరు-చెన్నై మార్గంలో నడుస్తోండగా.. బెంగళూరు-హుబ్లీ-ధార్వాడ్-బెళగావి మీదగా ఉత్తర కర్ణాటకకు మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు త్వరలో ప్రారంభం కానుంది.

బెంగళూరు-బెళగావి రైలు సర్వీసు ప్రారంభం తర్వాత బెంగళూరు-హైదరాబాద్ మధ్య ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. బెంగళూరు నుంచి కాచిగూడకు ఉదయం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తే, కళ్యాణ్ కర్ణాటక ప్రాంతానికి వెళ్లే కన్నడిగులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. అదే జరిగితే హైదరాబాద్ నుండి బెంగళూరుకి ప్రయాణం మరింత సులభతరం, సౌలభమయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత బెంగళూరు నుండి తిరుపతికి ఒకటి.. పూణే నుండి తిరుపతికి మరొక వందే భారత్ రైళ్లు కూడా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు ఇండియన్ రైలు అధికారులు చెప్తున్నారు.