Vande Bharat Express: పట్టాలెక్కిన వందే భారత్.. విమానంలో లేని సౌకర్యాలు ఇందులో ఏమున్నాయంటే?

Kaburulu

Kaburulu Desk

January 16, 2023 | 08:38 AM

Vande Bharat Express: పట్టాలెక్కిన వందే భారత్.. విమానంలో లేని సౌకర్యాలు ఇందులో ఏమున్నాయంటే?

Vande Bharat Express: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎట్టకేలకి పట్టాలెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. అలాగే- 699 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులకూ ఆయన శంకుస్థాపన చేశారు.

సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడిచే ఈ సెమీ హైస్పీడ్ రైలును ఆదివారం ఉదయం 10.30 గంటలకి మోడీ ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రైలు ప్రారంభమైన ఆదివారం ఒక్కరోజు ప్రత్యేక సమయాలలో ఈ రైలు ప్రయాణించగా 16వ తేదీ నుంచి అంటే సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు సేవలందిస్తుంది. ఈ రైల్లో అనేక సదుపాయాలు, ప్రత్యేకతలు ఉన్నాయని, విమానాల్లో కూడా లేని సౌకర్యాలను వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో అందుబాటులోకి తెచ్చామని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.

ఈ వందే భారత్ రైలులో ప్రయాణికుల సీట్లను 180 డిగ్రీలలో రొటేట్ అవుతాయని.. సీట్లలో నుండి బయట వ్యూ చూసేందుకు పెద్ద అద్దాలు.. సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా సీట్లు డిజైన్ చేశారని.. ప్రతి సీట్ కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఉంటాయని.. ఇండియన్ రైల్వేలో ఉండే కవచ్ సెక్యూరిటీ సిస్టంతోనే ఈ రైలును రూపొందించామని రైల్వే అధికారులు చెప్తున్నారు.

విమానాలలో సీటింగ్ తో పోలిస్తే.. వందే భారత్ రైలులో బెటర్ సీటింగ్ ఉందని.. లెగ్ బూటింగ్ స్పేస్ కూడా అధికంగా ఉందని.. స్టడీ కోసం ప్యాడ్ స్పేస్, ప్రతి సీటుకి సీసీ కెమెరా, ప్రతి సీటుకి సపరేట్ లైటింగ్ మెకానిజం.. ప్రయాణికులకు సౌకర్యవంతమైన డైనింగ్, నాణ్యమైన క్యాటరింగ్ ఇలా విమానాలకు మించి ఇందులో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని దక్షణ మధ్య రైల్వే శాఖ సీపీఆర్ఓ రాకేష్ వెల్లడించారు.