Botsa Satyanarayana: సభలు, రోడ్ షోలు నిషేధమని జీవోలో ఉందా?.. ప్రతిపక్షాలకు బొత్స ప్రశ్న!

Kaburulu

Kaburulu Desk

January 7, 2023 | 08:22 PM

Botsa Satyanarayana: సభలు, రోడ్ షోలు నిషేధమని జీవోలో ఉందా?.. ప్రతిపక్షాలకు బొత్స ప్రశ్న!

Botsa Satyanarayana: ఏపీలో సభలు, రోడ్ షోలపై ఆంక్షలు విధిస్తూ తీసుకొచ్చిన జీవో 1పై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ సభలు ర్యాలీలో 11 మంది మృతితో ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. నెల్లూరు జిల్లా కందుకూరులో 8 మంది.. గుంటూరులో ముగ్గురు తొక్కిసలాటలో మరణించగా.. జగన్ మోహన్ రెడ్డి సర్కారు సభలు, ర్యాలీలు, రోడ్ షోలలో ఆంక్షలు విధిస్తూ జీవో 1 తెచ్చింది. అయితే.. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన రసాభాసగా మారిన సంగతి తెలిసిందే.

కుప్పంలో చంద్రబాబు రోడ్ షోకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా చంద్రబాబు కుప్పం వెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు పోలీసులతో గొడవకి దిగారు. ఒక సందర్భంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేశారు. పోలీసుల నుండి నోటీస్ తీసుకొనేందుకు కూడా నిరాకరించిన చంద్రబాబు రోడ్ షో నిర్వహించాలనుకున్న ప్రాంతానికి వెళ్లారు. అయితే అప్పటికే చంద్రబాబు ప్రచార రథాన్ని సీజ్ చేసిన పోలీసులు అక్కడ మైకులు కూడా తొలగించారు. ఆ తర్వాత మూడు రోజుల కుప్పం పర్యటనలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది.

దీంతో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఘాటు విమర్శలతో దాడి చేసిన చంద్రబాబు.. పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ మొత్తం ఘటనపై మిగతా ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. సభలు, ర్యాలీలు రాజ్యాంగం, ఇచ్చిన హక్కు కాగా.. కాదనడానికి ప్రభుత్వానికి హక్కు లేదని టీడీపీ సహా మిగతా పార్టీలన్నీ గగ్గోలు పెట్టాయి. దీంతో ఈ జీవో కాస్త ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే.. దీనిపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ అసలు జీవోలో సభలు, ర్యాలీలపై నిషేధం అని ఎక్కడైనా ఉందా? ప్రతిపక్షాలు జీవో చదివారా అంటూ ప్రశ్నించారు. రోడ్లపై బహిరంగ సభలు పెట్టవద్దు అని మాత్రమే ఉంది.. మరీ అవసరమైతే అనుమతి తీసుకుని పెట్టాలని ఉందని చెప్పుకొచ్చిన బొత్స. ప్రచారపిచ్చితో అమాయక ప్రజలను చంపేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. అందుకే జీవో నంబర్‌ 1ని తీసుకొచ్చామని చెప్పారు. అనుమతులు తీసుకొని, ప్రజలకు ఇబ్బందులు లేని చోట సభలు నిర్వహించుకోవచ్చన్న ఆయన జీవోను ఒకసారి ప్రతిపక్షాలు చదువుకోవాలని హితవుపలికారు.