Vande Bharat Express: మేమింతే.. వందే భారత్ రైలును కంపు కంపు చేస్తున్న తెలుగు ప్రయాణికులు

Kaburulu

Kaburulu Desk

January 21, 2023 | 04:28 PM

Vande Bharat Express: మేమింతే.. వందే భారత్ రైలును కంపు కంపు చేస్తున్న తెలుగు ప్రయాణికులు

Vande Bharat Express: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రానే వచ్చింది.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చక్కర్లు కొడుతోంది. విమానాన్ని తలపించేలా సౌకర్యాలున్న రైలు కావడంతో కాస్త ధర ఎక్కువే అయినా ప్రయాణికులు కూడా ఈ రైల్లో ప్రయాణానికి ఆసక్తి చూపిస్తున్నారు. సికింద్రాబాద్- విశాఖపట్నం.. విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ సెమీ హైస్పీడ్ రైలుకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ కూడా వచ్చింది.

వందే భారత్ రైళ్లకు ఊహించిన స్థాయిలో మన తెలుగు రాష్ట్రాలలో ఆదరణ కన్పిస్తున్నా.. ఇక్కడే రైల్వేశాఖకు మరొక పెద్ద సమస్య వచ్చి పడింది. సాధారణ రైళ్లలో ప్రయాణించేవారికి అందరికీ తెలిసి.. రైళ్లు ఎలా ఉంటాయి.. ఎంత శుభ్రంగా ఉంటాయన్నది. ఏసీ, స్లీపర్ కోచ్ పైన రైళ్లు కొంతవరకు మేలే అయినా గమ్యస్థానానికి చేరుకొనే సరికి ప్రయాణికులు ఎక్కడి చెత్త అక్కడే పడేసి రచ్చ రచ్చ చేస్తారు. ఇక జనరల్ రైళ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

ఆ రైళ్లలో అలవాటై ఇది కూడా రైలే కదా అని అనుకుంటున్నారో.. విమానమైనా తామింతే ఉంటామని చేస్తున్నారో కానీ.. వందే భారత్ రైళ్లను మన తెలుగు ప్రయాణికులు కంపు కంపు చేస్తున్నారట. రైలు మొదలయ్యేప్పుడు మెరిసే అద్దంలా ఉంటుంటే.. గమ్యస్థానానికి చేరుకొనే సమయానికి చెత్తతో నిండేలా చేస్తున్నారట. ప్రయాణికులు తిన్న ఆహార కవర్లు, పేపర్లు, తాగిన బాటిల్స్, కుప్పలు ఎక్కడి చెత్త అక్కడే పడేసి వెళ్తున్నారట ప్రయాణికులు. దీంతో చివరి స్టేషన్ కి వెళ్లేసరికి చెత్త కుప్పలా కనిపిస్తుందట.

ఈ విషయంపై ప్రయాణీకులు ఒక్కసారి ఆలోచించాలని రైల్వే ఉన్నతాధికారుల చేతులు జోడించి వేడుకుంటున్నారు. వ్యక్తి గతంగా మనం ఎలా శుభ్రంగా ఉంటామో అలానే ట్రైన్ ను కూడా శుభ్రంగా ఉంచాలంటూ వేడుకుంటున్నారు. చెత్త, చెదారం, వ్యర్థాల కోసం ట్రైన్ లోని డస్ట్ బిన్ లను వాడాలని కోరుతున్నారు. ఇది మన గౌరవానికి సంబంధించిన సమస్య అంటూ చురకలు కూడా అంటిస్తున్నారు. మరి ఇకనైనా మన ప్రయాణికులు మారతారా?!