BRS Party: 20 అసెంబ్లీ, 3 పార్లమెంట్.. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పోటీచేసే స్థానాలివేనా?

Kaburulu

Kaburulu Desk

January 7, 2023 | 09:30 PM

BRS Party: 20 అసెంబ్లీ, 3 పార్లమెంట్.. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పోటీచేసే స్థానాలివేనా?

BRS Party: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని కాస్త జాతీయ గుర్తింపు ఉండేలా బీఆర్ఎస్ గా మార్చి ప్రచారం ప్రారంభించారు. ముందుగా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో పడ్డ కేసీఆర్.. ఇటీవల ఏపీకి చెందిన కొందరు ప్రముఖులను పార్టీలో చేర్చుకున్న సంగతి కూడా తెలిసిందే. మాజీ ఐఏఎస్ అధికారికి రాష్ట్ర పార్టీ పగ్గాలను అప్పగించిన కేసీఆర్.. మరికొందరు నేతలకు కూడా కండువాలు కప్పి ఘన స్వాగతం పలికారు.

సంక్రాంతి తర్వాత ఏపీలో భారీ ఎత్తున చేరికలను ప్రోత్సహించాలని చూస్తున్న కేసీఆర్ అండ్ కో.. ఏపీ నుండే పార్టీలో చేరే నేతలకు సొంత ఖర్చులతో ఘనాభజనా ఏర్పాటు చేసి మరీ స్వాగతం పలుకుతున్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. ఫ్లెక్షీల నుండి వాళ్ళ అనుచరుల ఖర్చు వరకు అన్నీ బీఆర్ఎస్ పార్టీనే భరిస్తుందని కూడా గట్టి ప్రచారం జరుగుతుంది. కాగా.. ఇప్పుడు ఏపీలో బీఆర్ఎస్ పోటీచేసే స్థానాలపై కూడా మరో ప్రచారం మొదలైంది.

కేసీఆర్ ముందుగా ఏపీలో కొన్ని స్థానాలలో మాత్రమే పోటీకి సిద్దమవుతున్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది.. అది కూడా తెలంగాణకు బోర్డర్‌గా ఉన్న జిల్లాలతో పాటు.. ఆ జిల్లాలతో అనుబంధంగా ఉండే జిల్లాలలో పోటీ చేయనున్నట్లు చెప్పుకుంటున్నారు. అందులో ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పోటీకి దిగాలని చూస్తున్నారట. అలాగే బాపట్ల, గుంటూరు, విశాఖ ఎంపీ సీట్లలో పోటీకి దిగాలని భావిస్తున్నారట.

ఐదు జిల్లాలలో జిల్లాకు 4 స్థానాలు చొప్పున 20 అసెంబ్లీ స్థానాలతో పాటు 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు గట్టి ప్రచారం జరుగుతుంది. అయితే.. ప్రచారానికి అనుగుణంగా ఒకవేళ బీఆర్ఎస్ ఆయా స్థానాలలో పోటీకి దిగితే ఏపీలో ఏ పార్టీకి నష్టం జరిగే ఛాన్స్ ఉందన్నది కూడా ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. అయితే.. సహజంగానే కొత్త పార్టీ ఇలా పోటీకి దిగితే సహజంగా ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉంటుంది. అదే నిజమైతే టీడీపీ, జనసేన పార్టీలకే నష్టం చేకూరే ఛాన్స్ ఉంటుంది. అందులో కూడా ఎన్నో సమీకరణలు, లెక్కలు ఉండగా.. ఏది ఏమైనా ఈ ఎన్నికల సమయానికి కానీ.. ఏ గాలి ఎటు వీయనుందో అంచనా వేయలేం.