AP High Court: ఫ్లెక్సీ వార్.. నిషేధించిన ప్రభుత్వం.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Kaburulu

Kaburulu Desk

January 25, 2023 | 07:13 PM

AP High Court: ఫ్లెక్సీ వార్.. నిషేధించిన ప్రభుత్వం.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

AP High Court: ఏపీలో ఇకపై ఫ్లెక్సీ అనేది కనిపించకూడదు.. నేటి నుండే రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేదిస్తున్నా.. ఇదీ గత ఏడాది సీఎం జగన్ ఓ సందర్భంలో చెప్పిన మాట. అందుకు అనుగుణంగానే గత ఏడాది నవంబర్ ఒకటి నుండి ఈ నిషేధాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయాలనుకుంది. అయితే క్లాత్ బ్యానర్ల కోసం సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రిని సమర్చుకునేందుకు.. తగిన సమయం ఇవ్వాలని ఫ్లెక్సీ తయారీదారుల విజ్ఞప్తి మేరకు అప్పుడు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. దీంతో ఈ ఏడాది జనవరి 26కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అప్పుడు సీఎం జగన్ సమయం వచ్చేసింది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఫ్లెక్సీల నిషేధం తెరమీదకి వచ్చింది. ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఎక్కడిక్కడ జిల్లాల అధికారులు ఫ్లెక్సీ తయారీదారులను పిలిచి సమావేశ పరిచి జనవరి 26 నుండి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. దీనిపై ఫ్లెక్సీ తయారీదారులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు తోసిపుచ్చింది. సింగిల్ యూజ్‌ ప్లాస్టిక్ ఫ్లెక్సీలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధం వర్తిస్తుందని హైకోర్టు ఈరోజు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది.

ఓవెన్, పీవీసీ ఫ్లెక్సీలకు ఈ నిషేధం వర్తించదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఫ్లెక్సీలపై నిషేధం సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఫ్లెక్సీ ఓనవర్స్‌ అసోసియేషన్ కు భారీ ఊరట దక్కినట్లయింది. కాగా, తాజా తీర్పులో మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే జారీ చేసిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 22వ తేదీకి వాయిదా వేసింది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందా? లేక తదుపరి విచారణ వరకు వేచి చూస్తుందా? రేపు జనవరి 26న ఫ్లెక్సీల నిషేధం అమలు చేస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.