TS Govt: పరేడ్‌తో కూడిన గణతంత్ర వేడుకలను నిర్వహించాల్సిందే.. హైకోర్టు తీర్పు

Kaburulu

Kaburulu Desk

January 25, 2023 | 06:52 PM

TS Govt: పరేడ్‌తో కూడిన గణతంత్ర వేడుకలను నిర్వహించాల్సిందే.. హైకోర్టు తీర్పు

TS Govt: తెలంగాణలో రిపబ్లిక్‌ డే వేడుకలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలు అధికారికంగా నిర్వహించాలని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై బుధవారం కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. గణతంత్ర వేడుకలను రాజ్‌భవన్‌ కే ఎందుకు పరిమితం చేశారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్ ఎందుకు పాటించరని ప్రశ్నించింది.

జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సర్క్యూలర్ పంపించింది. ఈ వేడుకల్లో విద్యార్థులను కూడా భాగస్వాములు చేయాలని కోరింది. అయితే.. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఓ వ్యక్తి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మాధవి ధర్మాసనం విచారణ చేసి.. కీలక తీర్పును వెలువరించారు.

2020, 2021 సంవత్సరంలో పబ్లిక్ గార్డెన్స్ లో గణతంత్ర వేడుకలు నిర్వహించగా.. వేడుకల్లో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అయితే కరోనా కారణంగా 2022లో మాత్రం గణతంత్ర వేడుకలు పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించడం లేదని ప్రభుత్వం.. గవర్నర్ కార్యాలయం రాజ్ భవన్ కు సమాచారం ఇచ్చింది. అప్పటి నుంచి, ఆ తర్వాత పరిణామాలతో అటు గవర్నర్ రాజ్ భవన్ కు ఇటు కేసీఆర్ ప్రగతిభవన్ కు మధ్య దూరం బాగా పెరిగింది.

ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా వేడుకలకు ప్రభుత్వం దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ తో కూడిన గణతంత్ర వేడుకలను అధికారికంగా నిర్వహించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించాల్సిందేనని.. రిపబ్లిక్ డే వేడుకలు ఎక్కడ నిర్వహించాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కరోజే సమయం ఉండడంతో రిపబ్లిక్ డే వేడుకలకు ఏర్పాటు త్వరితగతిన మొదలు పెట్టాలని కూడా సూచించింది. మరి ప్రభుత్వం ఏం చేయనుందో చూడాలి.