AP Capital: రాజధాని విశాఖ తరలింపుకి ముహూర్తం ఫిక్స్? డేట్ ఎప్పుడంటే?

Kaburulu

Kaburulu Desk

January 6, 2023 | 09:19 PM

AP Capital: రాజధాని విశాఖ తరలింపుకి ముహూర్తం ఫిక్స్? డేట్ ఎప్పుడంటే?

AP Capital: ఆరు నూరైనా విశాఖే ఏపీకి పరిపాలనా రాజధాని. మేమిప్పటికీ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. త్వరలోనే సరైన సమయం చూసి పరిపాలన విశాఖ నుండి మొదలు పెడతాం.. సరైన సమయం చూసి మరోసారి మూడు రాజధానుల బిల్లును కూడా అసెంబ్లీలో పెడతాం. ఇదీ ఏపీ రాజధానిపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుండి ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికీ చెప్పేమాట. అయితే.. ఆ సరైన సమయం ఎప్పుడు? అంటే త్వరలోనే అంటున్నారు ఇప్పుడు వైసీపీ వర్గాలు.

ఇప్పటికే పరిపాలన విభాగాన్ని విశాఖకి తరలించేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని ఇప్పుడు ప్రభుత్వ వర్గాలతో పాటు వైసీపీ శ్రేణులలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమే సమయమే ఉండగా.. ఎన్నికలకు వెళ్లే నాటికి విశాఖ నుండి పరిపాలన స్థిరీకరణ చేయాలనేది సీఎం ప్రణాళికగా ప్రచారం జరుగుతుంది. దీనికి కొద్ది రోజులలోనే కీలక ముందడుగు వేయాలని భావిస్తోంది. విశాఖకు రాజధానిని తరలించేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా ఈ ఏడాది ఉగాది తర్వాత రాజధాని అమరావతి నుండి పరిపాలన విభాగం తరలింపు ఉంటుందని చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు కూడా సన్నిహితుల వద్ద ఇదే అంశాన్ని ప్రస్తావించగా.. దీనికి త్వరలోనే తేదీని కూడా నిర్ణయించనున్నారని చర్చ జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖకు తరలింపుకు ప్రభుత్వం ముందున్న ప్రధాన అడ్డంకి.. సుప్రీం కోర్టులో ఈ కేసు పెండింగ్ ఉండడం. అయితే.. ఈ కేసు జనవరి 31న విచారణ ఉంది.

ఈ విచారణ తర్వాత ఈ తరలింపు ఉండవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టులో ప్రభుత్వ వ్యతిరేక తీర్పు వచ్చినా.. లేక.. మరి కొన్నాళ్ళు ఈ కేసు పెండింగ్ పడినా కూడా ప్రత్యామ్నాయ మార్గాలలో అయినా ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను విశాఖకు తరలించాలని కసరత్తులు జరుగుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే.. ఇది ప్రచారం వరకే ఉంటుందా? లేక జగన్ ప్రభుత్వం అనుకున్నంత పనిచేస్తుందా? అసలు సుప్రీంకోర్టులో తీర్పు ఏ విధంగా రాబోతుంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.