Bandi Sanjay: కలెక్టరేట్ ముట్టడి యత్నం.. కామారెడ్డిలో టెన్షన్ టెన్షన్!

Kaburulu

Kaburulu Desk

January 6, 2023 | 08:53 PM

Bandi Sanjay: కలెక్టరేట్ ముట్టడి యత్నం.. కామారెడ్డిలో టెన్షన్ టెన్షన్!

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కామారెడ్డి పర్యటన తీవ్ర ఉత్కంఠగా మారింది. కామారెడ్డి జిల్లా కేంద్రం మాస్టర్ ప్లాన్ విషయంలో సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన రైతు భూమి పోతుందనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు బండి సంజయ్ కామారెడ్డికి వచ్చారు. రైతు ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగగా.. భారీ ర్యాలీగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు.

బండి సంజయ్ వెంట భారీ స్థాయిలో బీజేపీ శ్రేణులు కలవగా.. బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. మాస్టర్ ప్లాన్ మార్చాలని డిమాండ్ చేసిన సంజయ్.. ప్రకటన వచ్చేవరకు రాత్రంతా కలెక్టరేట్ ఎదుటే కూర్చుంటానని తెలిపారు. కలెక్టర్ ఎందుకు బయటకు రారో చూస్తానని తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగిస్తానని ప్రకటించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద టెన్షన్ వాతావణం నెలకొంది.

నిన్న జరిగిన ఆందోళన నేపథ్యంలో కలెక్టరేట్ కు అర కిలోమీటరు దూరంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను తొలగించి రైతులు, బీజేపీ కార్యకర్తలు చొచ్చుకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఒక దశలో కలెక్టరేట్ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. అనుమతి లేదంటూ బండి సంజయ్ ను అడ్డుకోవడంతో అక్కడే తిష్ట వేశారు.

రైతు పయ్యావుల రాములుది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య. నిన్న రైతు మృతదేహం తరలింపు విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ బిఅర్ఎస్ ప్రభుత్వం శాశ్వతమని జిల్లా కలెక్టర్, పోలీసులు భావించకూడదు. మీరు చట్టబద్ధంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు ఇవాళ కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వెళితే పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామీకమని సంజయ్ విమర్శించారు. సంజయ్ కలెక్టరేట్ దగ్గరే సిట్టింగ్ వేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ వాతావరణం నెలకొంది.