AP Assembly: సీఎం ఢిల్లీ పర్యటనపై అసెంబ్లీలో చర్చకు డిమాండ్.. మరోసారి టీడీపీ సభ్యుల సస్పెన్షన్!

Kaburulu

Kaburulu Desk

March 18, 2023 | 10:43 AM

AP Assembly: సీఎం ఢిల్లీ పర్యటనపై అసెంబ్లీలో చర్చకు డిమాండ్.. మరోసారి టీడీపీ సభ్యుల సస్పెన్షన్!

AP Assembly: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు మరోసారి సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాక ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ జరగడం ఇది ఐదవసారి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే సీఎం జగన్ అప్పటికప్పుడు ఢిల్లీకి పయనమై ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అసెంబ్లీలో చర్చ జరపాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేయగా అది రసాభాసగా మారి చివరికి సస్పెండ్ వరకూ వెళ్ళింది.

అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ సభ్యులపై శనివారం మరోసారి సస్పెన్షన్ వేటు పడింది. మొత్తం 11 మందిని ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన ప్రతిపాదించగా స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన సభ్యులలో అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, చినరాజప్ప, బెందాళం అశోక్, గణబాబు, వెలగూపూడి, మంతెన రామరాజు, సాంబశివరావు, గొట్టి రవికుమార్, బాలవీరాంజనేయ, గద్దె రామ్మోహన్‌ ఉన్నారు.

శనివారం క్వశ్చన్ అవర్ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై చర్చ జరగాలని పట్టుబట్టారు. అయితే.. టీడీపీ సభ్యుల ప్రతిపాదన సభా సంప్రదాయాలకు విరుద్ధమని స్పష్టం చేసిన మంత్రి బుగ్గన.. సభా సమయాన్ని వృథా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ విషయంలో వాదనలు జరుగుతుండగానే వైసీపీ సభ్యులు గతంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనల గురించి చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎక్కడకి వెళ్లినా సభకు అవసరం లేదని.. ఏపీ ప్రజల ప్రతినిధిగా సీఎం ప్రధానితో భేటీ కావడం.. రాష్ట్రాల ప్రజలందరికీ తెలియాలని టీడీపీ సభ్యులు వాదనకి దిగారు. దీంతో సభలో గందరగోళం మొదలైంది. చివరికి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని బుగ్గన ప్రతిపాదనతో స్పీకర్ ప్రకటన చేశారు.