AP Assembly Sessions: నేడు ఏపీ బడ్జెట్.. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నలుగురు మంత్రులు!

Kaburulu

Kaburulu Desk

March 16, 2023 | 08:48 AM

AP Assembly Sessions: నేడు ఏపీ బడ్జెట్.. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నలుగురు మంత్రులు!

AP Assembly Sessions: ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో కీలక బడ్జెట్ అసెంబ్లీ ముందుకు వస్తోంది. జగన్ ప్రభుత్వం ఈ విడతలో చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో 2023-24 బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుండగా.. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఇక శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష ఆర్ధిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండగా.. మంత్రి సీదిరి అప్పలరాజు మండలిలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.

దాదాపుగా రూ.2.59 లక్షల కోట్ల అంచనాలతో ఈ ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలు సిద్దం అయింది. ఉదయం 8 గంటలకు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో బడ్జెట్‌ను ఆమోదించి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం, పేదల ఇళ్లకు పెద్దపీట వేయనుండగా.. సంక్షేమ రంగానికి మరోసారి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

మరోవైపు రాష్ట్ర తలసరి ఆదాయంలో 13.98% వృద్ధి నమోదైందని 2022-23 సామాజిక, ఆర్థిక సర్వేలో ప్రభుత్వం అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే రూ.26,931 కోట్లు పెరిగిందని తెలిపింది. దేశ తలసరి ఆదాయంలో వృద్ధి కంటే ఇది అధికమని తేల్చింది. 2022-23 సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.13.17 లక్షల కోట్లకు చేరిందని.. 16.22% వృద్ధి నమోదైందని పేర్కొంది.

అలాగే రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021-22లో రూ.11,33,837 కోట్లు ఉండగా.. 2022-23లో రూ.13,17,728 కోట్లుగా అంచనా వేశారు. రాష్ట్ర తలసరి ఆదాయం 2021-22లో రూ.1,92,587 ఉండగా.. 2022-23లో రూ.2,19,518కి చేరుతుందని అంచనా వేశారు. ఎన్నికల బడ్జెట్ కావడంతో గతం కంటే ఎక్కువ కేటాయింపులతో బడ్జెట్ రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ఈసారి కూడా నవరత్నాలు, సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.