TCongress: ధర్నా చౌక్‌లో ధర్నా ప్లాన్.. రేవంత్ హౌస్ అరెస్ట్

Kaburulu

Kaburulu Desk

January 2, 2023 | 11:54 AM

TCongress: ధర్నా చౌక్‌లో ధర్నా ప్లాన్.. రేవంత్ హౌస్ అరెస్ట్

TCongress: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పంచాయతీలకు నిధుల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ దగ్గర ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌.. సర్పంచ్‌లు పెద్ద ఎత్తున ధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చింది. సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరా గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టాలని నిర్ణయించారు.

అయితే.. కాంగ్రెస్‌ ధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. రేవంత్‌ ఇంటిని చుట్టుముట్టారు. పోలీసు వాహనాలు, వ్యాన్లను సిద్ధం చేసుకొని భారీగా పోలీసులతో ఇంటి చుట్టూ పహారా కాస్తున్నారు. అంతేకాదు, పలు చోట్ల కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కిసాన్ సెల్ నేత కోదండరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ డీసీసీ ప్రెసిడెంట్స్ ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

దీంతో పోలీసుల తీరుపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఇది దుర్మార్గమైన చర్యని.. నియంత ధోరణికి పరాకాష్ఠ అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ముందుగా నాలుగు రోజుల క్రితమే రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ కి లేఖ రాశారు. ఆ లేఖలో స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా ఇచ్చే నిధులు విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్న రేవంత్ రెడ్డి ప్ర‌తీ నెల విడుదల చేయాల్సిన రూ.250 కోట్లు 5 నెలలుగా విడుదల చేయ‌డంలేదని అన్నారు.

ఆ తర్వాత ధర్నాపై కాంగ్రెస్ నేతలు అనుమతి కోరుతూ పోలీసులకు కూడా లేఖ రాసుకున్నారు. కానీ ధర్నా నిర్వహించుకునేందుకు టీపీసీసీ పెట్టుకున్న దరఖాస్తుకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. అయితే పోలీసులు అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా ధర్నా నిర్వహిస్తామని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. అనుకున్నట్లుగానే ఈరోజు ధర్నాకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ పోలీసులు ఇలా అరెస్టు చేస్తున్నారు.