TDP Road Show: మొన్న 8 మంది.. ఇప్పుడు ముగ్గురు.. ఎవరిది వైఫల్యం.. ఎందుకింత దారుణం?!

Kaburulu

Kaburulu Desk

January 2, 2023 | 12:30 PM

TDP Road Show: మొన్న 8 మంది.. ఇప్పుడు ముగ్గురు.. ఎవరిది వైఫల్యం.. ఎందుకింత దారుణం?!

TDP Road Show: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ యాత్ర కాస్త ఓదార్పు యాత్రగా మారుతుంది. కందుకూరులో ఘోర విషాద ఘటన మరవక ముందే గుంటూరులో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. గుంటూరు వికాస్ నగర్ లో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. వారంతా గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు.

అటు కందుకూరులో జరిగిన ఘటనలో.. ఇప్పుడు గుంటూరు ఘటనలో మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి రూ.30 లక్షల వరకు పరిహారం ప్రకటించారు. టీడీపీ పార్టీతో పాటు ఆ పార్టీలో కొందరు నేతలు కూడా మృతులకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలలో చిన్న పిల్లలు ఉంటే వారి విద్య బాధ్యతలను కూడా టీడీపీ తీసుకుంటుందని ప్రకటించారు. అయితే.. ఎంత పరిహారం ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగిరాదు. ఆ కుటుంబాలలో ఆ శోకం ఎప్పటికీ తీరదు.

మరి.. ఈ వరస ఘటనలకు బాధ్యులెవరు? ఎవరిది వైఫల్యం? ఎందుకింత దారుణం?. ముందుగా కందుకూరు తొక్కిసలాటను తీసుకుంటే.. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. భద్రత విషయంలో కూడా ఎలాంటి లోపం లేదని పోలీసు శాఖ ఘటన అనంతరం సమర్ధించుకుంది. అయితే.. ఇక్కడ జనాభా అంచనాలను మించి రావడం.. పోలీసు భద్రత సరిపోకపోవడం వలనే ప్రమాదం జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కార్యక్రమ నిర్వాహకులు కూడా అక్కడ పరిమితికి మించి జనాభాను తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇక గుంటూరు ఘటన విషయానికి వస్తే.. ఉయ్యూరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, పేదలకు చంద్రబాబు సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. సభా ప్రాంగణంపై చంద్రబాబు నామ్ కే వాస్తీగా ఫోటోల కోసం పంపిణీ ప్రారంభించి వెళ్లిపోయారు. ఆతర్వాత కిట్ల కోసం ప్రజలు ఎగబడటం వల్లే తొక్కిసలాట జరిగి ప్రమాదం జరిగింది. అయితే.. రెండు ఘటనలో ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది నిర్లక్ష్యమే.

సహజంగా రోడ్ షో అంటే అది రహదారుల మీదనే నిర్వహిస్తారు. అది ఏ పార్టీ తలపెట్టినా అదే చేస్తారు. గతంలో జగన్ రోడ్ షోలు కూడా ఇలాగే సాగాయి. అయితే.. కందుకూరులో 10 వేల మంది అంచనా వేస్తే 25 వేల మంది వచ్చారు. దీంతో పోలీస్ యంత్రాంగం కంట్రోల్ తప్పింది. ఓ జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న నాయకుడిని ఆ స్థాయిలోనే భద్రత కూడా కల్పించాలి. ఆ కోణంలో చూసినా పోలీసుల నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ఇక.. అనుమతి తీసుకున్న సమయం గడిచి పోయిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించడం టీడీపీ నిర్వాహకుల వైఫల్యం.

ఇక, గుంటూరు విషయానికి వస్తే ఇది సభ. సభ అనంతరం కానుకల పంపిణీ. ఇలా పంపిణీ కార్యక్రమం ఉన్నప్పుడు ఒక క్యూ పద్దతిలోనో.. లేక బారికేడ్ల ద్వారా కానీ పంపిణీ చేపట్టాలి. పోలీసులు కూడా ప్రజలను కంట్రోల్ చేసే స్థాయిలో బలగాలను దింపాలి. ఇక్కడ ఇవి రెండూ లేవు. కానుకల పంపిణీ ఉందని టీడీపీ నిర్వాహకులు పోలీసులకు చెప్పామని చెప్తుంటే.. మాకు సమాచారం లేదని పోలీసులు నిర్వాహకులపై రిటర్న్ కేసు పెట్టారు. ఇలా రెండు వైపుల నుండి వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుండగా.. బలయ్యింది మాత్రం అమాయక ప్రజలు, కార్యకర్తలే.