BJP: రాష్ట్ర పగ్గాలు ఈటలకి.. బండి ఢిల్లీకి.. బీజేపీ మాస్టర్ ప్లాన్ ఇదేనా??

Kaburulu

Kaburulu Desk

January 2, 2023 | 10:13 AM

BJP: రాష్ట్ర పగ్గాలు ఈటలకి.. బండి ఢిల్లీకి.. బీజేపీ మాస్టర్ ప్లాన్ ఇదేనా??

BJP: తెలంగాణలో ఎన్నికలకు నిండా ఏడాదే సమయముంది. ఇలాంటి టైంలో బీజేపీ పార్టీలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉందా అంటే.. అవుననే అంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. అది కూడా ఏకంగా పార్టీ అధ్యక్షుడి మార్పు అంటూ భారీ ప్రక్షాళన చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ పెద్దలకు విధేయుడిగా పేరు తెచ్చుకోవడంతో పాటు పార్టీని బలోపేతం చేయడంలో కూడా బండికి మంచి పేరుంది. అయినా బండిని అధ్యక్ష పదవి నుండి తప్పించనున్నారని ప్రచారం జరుగుతుంది.

టీఆర్ఎస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన హుజురాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కు రాష్ట్ర పార్టీ బాధ్యతలను అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తిగా.. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి కేసీఆర్‌ వెంట నడిచిన ఈటల ఆ తర్వాత జరిగిన పరిణామాలలో కేసీఆర్ కు దూరమయ్యారు. అంతేకాదు కేసీఆర్‌పై తిరుగుబాటు ప్రకటించి ఉపఎన్నికల్లో గెలిచి సత్తా చాటుకున్న ఈటల కేసీఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యమని ఇప్పటికే పలుమార్లు సవాల్ కూడా చేశారు.

టీఆర్ఎస్ నుండి బయటకొచ్చిన ఈటల బీజేపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. కానీ.. బీజేపీ ఆయన అనుభవాన్ని పూర్తిగా వినియోగించుకోవడం లేదనే అసంతృప్తి ఉంది. అయినా పార్టీ జాయినింగ్ కమిటీ చైర్మన్‌ గానే ఈటల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ సంఘాలు, ముఖ్యంగా యువత మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన ఈటల ముఖ్యంగా బీసీలను దగ్గర చేసుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొనే పార్టీ అధిష్టానం ఈటలకు త్వరలోనే రాష్ట్ర పగ్గాలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

కేవలం పార్టీ బాధ్యతలే కాదు.. ఈటలను సీఎం అభ్యర్థిగా ప్రకటించినా ఆశ్చర్యం లేదంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇక, ప్రస్తుతం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ కి ఢిల్లీకి ప్రమోషన్ లభించే అవకాశం ఉందని తెలుస్తుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్ గా మోడీ క్యాబినెట్ లో మార్పులు చేసే అవకాశం ఉండగా.. కేంద్ర మంత్రులలో కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు వినిపిస్తుంది. వారిలో బండికి కూడా అవకాశం దక్కుతుందని ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. అయితే.. వచ్చేది ఎన్నికల సమయం కనుక మార్పులు, చేర్పులతో అసంతృప్తి జ్వాలలు రగిలే ఛాన్స్ ఉంటుంది. మరి బీజేపీ అలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా అనేది చూడాల్సి ఉంది.