Viveka Murder Case: మీరు చెప్పినట్లే రండి.. ఎంపీ అవినాష్ కు మళ్ళీ సీబీఐ నోటీసులు

Kaburulu

Kaburulu Desk

January 25, 2023 | 03:17 PM

Viveka Murder Case: మీరు చెప్పినట్లే రండి.. ఎంపీ అవినాష్ కు మళ్ళీ సీబీఐ నోటీసులు

Viveka Murder Case: మాజీ సీఎం వైఎస్ఆర్ సోదరుడు, సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగం పుంజుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు తెలంగాణకు విచారణ మారిన తర్వాత సీబీఐ జోరు పెంచింది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో అనుమానాలతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి విచారణకు నోటీసులు ఇచ్చింది. అయితే తనకు ముందుగా ప్రణాళికలు కొన్ని ఉన్నందున అవినాష్ గడువు కావాలని కోరారు.

సోమవారం పులివెందులకు వెళ్లిన సీబీఐ అధికారులు.. మంగళవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈ నోటీసులు ఇచ్చారు. సీబీఐ ఇచ్చిన నోటీసులపై స్పందించిన వైఎస్ అవినాష్ రెడ్డి.. విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని.. కాకపోతే మంగళవారం రోజు పులివెందులలో బిజీ షెడ్యూల్ ఉందని.. ఆ రోజున విచారణకు హాజరు కాలేనని తెలిపారు.

తాను ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటంవల్ల.. నాలుగు రోజుల తర్వాత ఎప్పుడు పిలిచినా వస్తానని అవినాష్ చెప్పారు. ఆ తర్వాత సీబీఐ అదనపు బలగాలను కోరడంతో ఎంపీ అవినాష్ ను అరెస్ట్ చేస్తారా? అనే ప్రచారం కూడా కడప జిల్లాలో జరిగింది. అయితే.. ఊహించని విధంగా సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 28వ తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని తాజా నోటీసుల్లో పేర్కొంది.

అవినాష్ కోరినట్లుగానే నాలుగు రోజుల తర్వాత హాజరుకావాల్సిందేనని సీబీఐ మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండున్నరేళ్లుగా సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోండగా.. కేసులో ముద్దాయిగా ఉన్న అవినాశ్ ను ఇంతవరకు సీబీఐ విచారించలేదు. తొలిసారి ఆయనను విచారణకు రావాల్సిందిగా సీబీఐ వరసపెట్టి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు రాజకీయాలలో ఆసక్తిగా మారింది.