Viveka Murder Case: సుప్రీంలో నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య పిటిషన్.. సీబీఐపై కోర్టు సీరియస్!

Kaburulu

Kaburulu Desk

March 20, 2023 | 09:25 PM

Viveka Murder Case: సుప్రీంలో నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య పిటిషన్.. సీబీఐపై కోర్టు సీరియస్!

Viveka Murder Case: గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా హత్య కేసు ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగగా.. నేటికీ ఆ కేసు విచారణ పూర్తి కాలేదు. ఎన్నికలకు ముందు ఈ హత్య జరగగా.. సీఎం జగన్ ప్రభుత్వం సమయం కూడా పూర్తి కావస్తున్నా ఆ కేసు మాత్రం ఇంకా తేలలేదు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అంతకంతకూ ఆలస్యమవుతోంది. కొన్నాళ్ళు కరోనాతో పాటు పలు సవాళ్లను ఎదుర్కొన్న సీబీఐ.. ఇప్పటికీ దర్యాప్తును ఓ కొలిక్కి తీసుకురాలేకపోతోంది.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు దర్యాప్తు జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో జాప్యం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్ ను మార్చాలని కూడా తన పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ సీబీఐ దర్యాప్తు అధికారిని ప్రశ్నించింది.

అంతేకాదు, కేసు విచారణ పురోగతి, తాజా పరిస్థితిపై సీల్డ్ కవర్ నివేదిక ఇవ్వాలని సీబీఐను ఆదేశించింది. ఈ సందర్భంగా సీబీఐ న్యాయవాది వాదనలు వినిపించారు. దర్యాప్తు అధికారి సజావుగానే తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, దర్యాప్తు సక్రమంగానే నిర్వహిస్తున్నారని సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. వాదనలు విన్న పిమ్మట తదుపరి విచారణను సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసులో ఏ-4గా ఉన్న దస్తగిరిని అప్రూవర్‎గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ భాస్కర్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు. దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను సీబీఐ విచారణ జరుగుతుంది. ఈ మేరకు ఆయన్ను అప్రూవర్‎గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగా తమను ఈ కేసులోకి లాగడం కరెక్టు కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, దస్తగిరికి బెయిల్‎ను రద్దు చేయాలని భాస్కర్ రెడ్డి కోర్టును కోరారు.