Building Collapse: కూలిన నాలుగు అంతస్తుల భవనం.. ముగ్గురు మృతి.. శిథిలాల కింద మరో 20 మంది

Building Collapse: ఉత్తర ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో ఘోర ప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనం కూలి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 15 కుటుంబాలు శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. భూకంపం అనంతరం ఈ భవనం కూలినట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ఉత్తరాదిలో భూ ప్రకంపనలు చోటు చేసున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం 2.28 గంటల సమయంలో సుమారు 30 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప తీవ్రతకు ఇళ్లలో వస్తువులు కదిలిన దృశ్యాలను ఢిల్లీ వాసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు కూలిన భవనానికి సంబంధించి అపార్ట్మెంట్ బేస్ మెంట్ లో గత కొన్ని రోజులుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది.
భూకంపం, ఇటు నిర్మాణ పనులు కలిసి భవనం కూలిపోయినట్లు తెలుస్తుంది. భూప్రకంపనల అనంతరం ఇజ్రత్ గంజ్ ప్రాంతంలోని ఈ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. శిథిలాల కింద 35 మందికి పైగా చిక్కుకున్నట్లు తెలుస్తోండగా.. సహాయక సిబ్బంది ఇప్పటికి 3 మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. మరో 12 మందిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా మరో 20 మంది వరకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
భవనం కూలిన వార్త అందుకోగానే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే 12 మందిని కాపాడగలిగారు. భవనం కుప్ప కూలిన ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు అందాలని జిల్లా యంత్రాగాన్ని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనను యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పతక్ ధ్రువీకరించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మూడు మృతదేహాలను వెలికి తీసినట్లు ఆయన చెప్పారు. మరికొందరు శిథిలాల్లో చిక్కుకున్నట్లు ఆయన వెల్లడించారు.