AP BJP: బీజేపీ ఇంటిపోరు.. పొత్తులపై సోము వ్యాఖ్యలు.. 120 మంది రాజీనామా?

Kaburulu

Kaburulu Desk

January 25, 2023 | 08:41 AM

AP BJP: బీజేపీ ఇంటిపోరు.. పొత్తులపై సోము వ్యాఖ్యలు.. 120 మంది రాజీనామా?

AP BJP: ఏపీలో బీజేపీకి ఉన్న ఓటింగ్ శాతం ఎంత.. ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయన్నది అందరికీ తెలిసిందే. అయితే.. ఏపీ బీజేపీకి ఉన్న బలం ఎంత అనేది ఎలా ఉన్నా ఇక్కడ పార్టీలో రెండు గ్రూపులు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుది ఒక వర్గం కాగా.. మాజీ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణది మరొక వర్గమట. ఈ రెండు వర్గాల మధ్య వివాదం కాస్త పార్టీ నేతల రాజీనామా వరకు వెళ్లడం విశేషం.

తాజాగా భీమవరంలో జరిగిన బీజేపీ కార్యవర్గ భేటీలో సోము వీర్రాజు కీలక ప్రకటన చేశారు. బీజేపీ రాష్ట్రంలో చేపట్టే భవిష్యత్ ఉద్యమాలను వివరించిన సోము.. త్వరలో ప్రజాపోరు 2 ప్రారంభం అవుతుందన్నారు. టీడీపీ, వైసీపీ కుటుంబ పార్టీలకు బీజేపీ దూరమని ప్రకటించిన ఆయన.. జనసేనతో కలిసే ఉన్నాం, కలిసే ఉంటామని కూడా వెల్లడించారు. చంద్రబాబు, జగన్ లు బీజేపీపై కుట్రలు మానుకోవాలన్నారు. బీజేపీని బలహీన పర్చేందుకు కుట్రలు చేసే వారికి రాజకీయ సమాధానం చెబుతామన్నారు.

తాజాగా తెలంగాణలోని కొండగట్టు వెళ్లిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు కొనసాగుతుందని, అయితే కొత్త పొత్తులకు కూడా సిద్ధమేనని వ్యాఖ్యానించారు. ఒకరకంగా మాత్రం జనసేనతోనే తమ పొత్తు కొనసాగుతుందంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీకి పవన్ గుడ్ బై చెబుతారంటూ ప్రచారం జరుగుతుంది. టీడీపీని కాదంటే బీజేపీని వదులుకోవడం పవన్ కు పెద్ద పనేం కాదు. ఎందుకంటే అతిపెద్ద ప్రతిపక్షం టీడీపీ.

ఒకవైపు సోము ఇలా స్టేట్మెంట్స్ ఇస్తుంటే.. రాష్ట్రంలో బీజేపీలో మరో వర్గం రాజీనామాల ప్రకటన చేసింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని కన్నా లక్ష్మీ నారాయణ అనుచరులు మంగళవారం క్రోసూరులో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు సైదారావు మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన ఆస్తులను పెంచుకోవడానికి పార్టీని వైసీపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వర్గమనే మమ్మల్ని కార్యవర్గ సమావేశాలకూ పిలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీర్రాజు తప్పుడు నిర్ణయాలను ప్రజలకు, జాతీయ నాయకత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో పార్టీ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నామని ప్రకటించారు. పార్టీ సీనియర్ నేతలు, 5 మండలాల అధ్యక్షులు కూడా రాజీనామా ప్రకటన చేశారు.