Viveka Murder Case: నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన కోర్టు!

Kaburulu

Kaburulu Desk

March 25, 2023 | 06:42 PM

Viveka Murder Case: నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన కోర్టు!

Viveka Murder Case: మాజీ సీఎం వైఎస్ఆర్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడుగా ఉన్న సంగతి తెలిసిందే. రేపో మాపో అరెస్టులు మొదలవుతాయని ప్రచారం జరుగుతుండగానే మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలాన్ని పులివెందుల కోర్టు నమోదు చేసింది. ఈ హత్యతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని.. కేసు విచారణలో సీబీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కోర్టులో తులసమ్మ పిటిషన్ వేశారు.

తులసమ్మ సీబీఐపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పిటిషన్ లో పేర్కొంది. ఈ కేసులో వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివప్రకాశ్ రెడ్డిని కూడా విచారించాలని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. గత నెల 21న పులివెందుల కోర్టులో ఆమె ప్రైవేటు కేసు వేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆమె వాంగ్మూలాన్ని పులివెందుల కోర్టు నమోదు చేసింది. సాక్షిగా వివేకా పీఏ కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది.

కాగా, ఈ వారంలోనే ఈ హత్య కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతుందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను విచారణాధికారి బాధ్యతల నుంచి తప్పించి, మరోఅధికారిని నియమించాలని కోరుతూ నిందితుడు శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమె పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఆర్‌షా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టి హత్య కేసు దర్యాప్తును ఎందుకు పూర్తి చేయడం లేదని, ఎందుకు ఆలస్యం చేస్తున్నారని దర్యాప్తు అధికారిని ధర్మాసనం ప్రశ్నించింది.

కేసు విచారణ త్వరగా ముగించకుంటే మరో అధికారిని ఎందుకు నియమించకూడదని కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి సక్రమంగానే విచారణ చేస్తున్నారని సీబీఐ తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నటరాజన్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తులో పురోగతి ఉందని, దర్యాప్తు అధికారిని మార్చాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. సీబీఐ వాదనలు విన్న ధర్మాసనం.. కేసు విచారణ పురోగతి, తాజా పరిస్థితిపై సీల్డ్‌ కవర్‌లో నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. అదలా ఉండగానే పులివెందుల కోర్టులో కూడా ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు.