Andhara Pradesh Debts: బుగ్గన vs యనమల.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మాటల యుద్ధం!

Kaburulu

Kaburulu Desk

February 5, 2023 | 01:30 PM

Andhara Pradesh Debts: బుగ్గన vs యనమల.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మాటల యుద్ధం!

Andhara Pradesh Debts: తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై చర్చల మధ్యనే ఏపీ ఆర్ధిక పరిస్థితి, అప్పులపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఏపీ ఆర్ధిక మంత్రి గుగ్గిన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్ర బడ్జెట్ పై స్పందిస్తూ తెగ పొగిడేశారు. కేంద్ర బడ్జెట్ బాగానే ఉందని.. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్ గా పేర్కొన్నారు. అయితే.. ఏపీకి కేటాయింపులు ఎక్కడని, విభజన హామీల ఊసే లేకుండా పెట్టిన బడ్జెట్ మంత్రిగా మంచి బడ్జెట్ గా ఎలా కనిపించిందని ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టారు.

ముందుగా దీనిపై స్పందించిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు.. బడ్జెట్ పై వైసీపీ నాయకులు అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓవైపు రాష్ట్రానికి అన్యాయం జరిగితే నోరు మెదపకుండా ఇది మా గొప్పతనమేనని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. పత్రికా ప్రకటన విడుదల చేసిన యనమల.. రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నా 32 మంది ఎంపీలు ఉండి కూడా నోరు మెదపలేకపోవడానికి కారణమేంటని నిలదీశారు.

టీడీపీ పాలనలో రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించగా ప్రస్తుతం మైనస్ 4 శాతానికి పడిపోయిందని.. నాలుగేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 1.22 లక్షల కోట్ల వివరాలు వెల్లడించాలని యనమల డిమాండ్ చేశారు. పెరిగిన రాష్ట్ర ఆదాయాన్ని వైసీపీ నేతలు మింగేశారు కాబట్టే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైందని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.

యనమల ఆరోపణలపై స్పందించిన మంత్రి బుగ్గన.. యనమల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై టీడీపీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. స్థిర ధరల వృద్ధి రేటులో 2021- 22 ఏడాదికి సంబంధించి ఏపీ 11.22 శాతం వృద్ధి నమోదు చేయగా.. ఏ విధంగా లెక్క వేసినా మైనస్‌ 4 శాతం వృద్ధి అనేది అసాధ్యమన్నారు. 2019లో టీడీపీ దిగిపోయే నాటికి రూ.2,64,451 కోట్ల అప్పు ఉంటే.. 2022 నాటికి రూ.3,98,903 కోట్లు అయినట్టు పార్లమెంటులో కేంద్రం ప్రకటించిందని.. అంటే, గత మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,34,452 కోట్లు మాత్రమేనని బుగ్గన వివరించారు.