Earth Quake: నిజామాబాద్ జిల్లాలో భూకంపం.. తెలుగు రాష్ట్రాల్లో వరస భూకంపాలకు కారణమేంటి?

Kaburulu

Kaburulu Desk

February 5, 2023 | 01:04 PM

Earth Quake: నిజామాబాద్ జిల్లాలో భూకంపం.. తెలుగు రాష్ట్రాల్లో వరస భూకంపాలకు కారణమేంటి?

Earth Quake: నిజామాబాద్ జిల్లాలో భూప్రకంపనలు కలకలం రేపాయి. ఆదివారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. భూమి నుండి పెద్ద పెద్ద శబ్దాలతో భూకంపం రావడంతో జనం ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం తెలంగాణలోని నిజామాబాద్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 8:12 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో, 19.43 అక్షాంశం, 77.27 రేఖాంశం మధ్యలో భూకంపం సంభవించింది.

నాందేడ్ సమీపంలో.. నిజామాబాద్‌కి 120 కిమి దూరంలో, ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్సీఎస్ పేర్కొంది. అయితే ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు నమోదు అవుతుండటంపై భూకంపాలు ఎందుకు నమోదు అవుతున్నాయనే దానిపై సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు.

గత ఏడాది నవంబర్ 16న ఏపిలోని చిత్తూరు జిల్లా పలమనేరు, గంటఊరు, గంగవరం, కీలపట్ల, బండమీద జిరావారిపల్లి తదితర ప్రాంతాల్లో 15 నిమిషాల వ్యవధిలో మూడు సార్లు భూప్రకంపనలు కనిపించాయి. మరోవైపు, తెలంగాణలో భూప్రకంపనలు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 6న జహీరాబాద్ మండలం బిలాపూర్‌లో భూమి కంపించింది. ఇక 2021 అక్టోబర్ 21న మంచిర్యాల, కరీంనగర్, రామగుండంలో భూప్రకంపనలు సంభవించగా.. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0గా నమోదైంది. అలాగే 2022 అక్టోబర్ 15న ఆదిలాబాద్ జిల్లాలో, 2021 నవంబర్ 1న కుమురంభీమ్, మంచిర్యాల జిల్లాల్లో కూడా భూమి కంపించింది.