Visakhapatnam: నాగుపాము తలకి గాయం.. ఆపరేషన్ చేసి తలపై కుట్లు వేసిన వైద్యుడు!

Visakhapatnam: వైద్యులు దేవుళ్ళతో సమానం అని ఊరికే అనరు. అమ్మ ప్రాణం పోస్తే.. మనకి ఎలాంటి అనారోగ్యం చేసినా మళ్ళీ డాక్టర్లు ప్రాణం పోసి పునర్జన్మని ఇస్తారు. అందుకే వైద్యో నారాయణో హరి అని మన పురాణాల నుండే దేవుళ్ళకి సముచిత స్థానం కల్పించారు. సహజంగా పాములంటే అందరికీ భయమే ఉంటుంది. అలాంటిది నాగుపాము అయితే దాని కంట్లో పడినా పగబట్టి కాటేస్తుందని సమాజంలో ఒక భయం ఉంటుంది.
కానీ, అంతటి విషపూరితమైన నాగుపాముకి గాయమైతే ఆపరేషన్ చేసి తలపై కుట్లు వేసి తన వృత్తిపై మరింత గౌరవం పెంచాడు ఓ డాక్టర్. పామే కదా అని లైట్ తీసుకోకుండా కష్టపడి జాగ్రత్తగా దానికి ఆపరేషన్ చేసి మరో జన్మని ప్రసాదించాడు. విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్లో ఈ నాగపాముకు శస్త్ర చికిత్స అందించడం మరో విశేషం.
గాజువాక పోలీస్ స్టేషన్ సమీపంలో నిన్న ఉదయం 11 గంటల సమయంలో దాదాపు ఆరు అడుగుల పొడవున్న గోధుమ కలర్లోని నాగు పాము.. మూడంతస్తుల బిల్డింగ్ నుంచి జారిపడిపోయింది. అది పడిన చోటనే కదల్లేని స్థితిలో ఉండిపోయింది. ఇది గమనించిన స్థానికులు.. స్నేక్ క్యాచర్కు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకున్న అతను.. దాని పరిస్థితిని చూసి.. తనకు తెలిసిన వైద్యం అందించాడు.
ఆ తర్వాత మల్కాపురం పశువుల ఆస్పత్రి వైద్యుడు సునీల్ దగ్గరకు తీసుకెళ్లగా.. ఆ నాగపాము పరిస్థితిని గమనించిన ఆయన.. దాదాపు గంటపాటు శ్రమించి శస్త్ర చికిత్స చేసి పాము తలభాగంలో కుట్లు వేశారు. ప్రస్తుతం పాము ఆరోగ్యం నిలకడగా ఉందని.. కొద్ది రోజులలో దాని గాయం కూడా మానిపోతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా నాగపాము బిల్డింగ్ మీద నుండి కింద పడడం.. గాయమవడం.. దానికి శస్త్ర చికిత్స చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.