TDP-YSRCP: చంద్రబాబుతో వైసీపీ నేత విమాన ప్రయాణం.. గొప్ప సీఎం అంటూ పొగడ్తలు!

Kaburulu

Kaburulu Desk

February 4, 2023 | 08:40 PM

TDP-YSRCP: చంద్రబాబుతో వైసీపీ నేత విమాన ప్రయాణం.. గొప్ప సీఎం అంటూ పొగడ్తలు!

TDP-YSRCP: మాజీ సీఎం చంద్రబాబు, ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ రాష్ట్ర యూత్ కార్యదర్శి కలిసి విమాన ప్రయాణం చేశారు. ఇద్దరూ పక్క పక్క సీట్లలో కలిసి ప్రయాణిస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఇందులో కొత్తేమీ లేదే అనుకుంటున్నారా!. కేవలం ప్రయాణం మాత్రమే చేయడం కాదు.. చంద్రబాబుతో సెల్ఫీ వీడియో తీసుకున్న వైసీపీ యూత్ లీడర్ చంద్రబాబును ఆహా ఓహో అంటూ పొగడడమే కాకుండా.. సీఎం చంద్రబాబే కావాలని.. సీఎం అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే సీఎం అంటూ ఆకాశానికి ఎత్తేశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హాట్ టాపిక్ గా మారింది.

శుక్రవారం రాత్రి ఇండిగో విమానంలో చంద్రబాబు గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లారు. అదే సమయంలో వైసీపీ యూత్ లీడర్ మీరావలి కూడా అదే విమానంలో ఉన్నారు. చంద్రబాబుతో విమాన ప్రయాణాన్ని మీరావలి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో చూస్తే.. ‘ఇవాళ నాతో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాత నారా చంద్రబాబునాయుడు గారు ఫ్లయిట్ జర్నీ చేస్తున్నారు. ఆయన చార్టర్డ్ విమానాల్లో తిరుగుతుంటారని, రాజధాని నిర్మాణం కోసం డబ్బులు వృథా చేస్తుంటారని చాలామంది చెబుతుంటారు. కానీ అదంతా నిజం కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమని భావించే వ్యక్తి ఆయన. నేను వైసీపీ అయినా సరే ఆయన నా పక్కనే కూర్చుని ప్రయాణం చేస్తున్నారు’ అని వివరించారు.

ఆ తర్వాత మీరావలి ఇండిగో విమానంలో తన సహ ప్రయాణికుడిగా ఉన్న చంద్రబాబుకు తనను తాను పరిచయం చేసుకున్నారు. ‘నా పేరు మీరావలి సార్.. మాది పెదకూరపాడు నియోజకవర్గం. రాజధాని గురించి మీరు చేసిన కృషి ఆనందదాయకం. మాకు మా రాజధాని కావాలి.. అది కూడా అమరావతే కావాలి. జై అమరావతి, జై చంద్రబాబునాయుడు. నేను వైసీపీ అని చెప్పిన తర్వాత కూడా ఆయన నా పక్కన కూర్చున్నారు. ఆయన వ్యక్తిత్వానికి ఇది నిదర్శనం. చంద్రబాబు వంటి వ్యక్తి మనందరికీ కావాలి. ఇక్కడ రాజకీయాలు ముఖ్యం కాదు’ అంటూ మీరావలి వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది.