Supreme Court: సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు.. కొలిజియం సిఫారసులకు ఆమోదం

Kaburulu

Kaburulu Desk

February 4, 2023 | 08:20 PM

Supreme Court: సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు.. కొలిజియం సిఫారసులకు ఆమోదం

Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు రానున్నారు. వివిధ హైకోర్టుల్లో జడ్జీలుగా ఉన్నఐదుగురికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలన్న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు కేంద్రం ఆమోదం తెలిపింది. త్వరలోనే వారి నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్రం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు స్పష్టం చేసింది.

కొలీజియం సిఫారసుతో రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కేంద్రం పంపిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇప్పుడు కొత్తగా మరో ఐదుగురు జడ్జిలు రానున్నారు. సుప్రీంకోర్టుకు నూతన న్యాయమూర్తులకు సంబంధించి కొలీజయం గతంలోనే కేంద్రానికి సిఫారసు చేసింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో తాజా నియామకానికి మార్గం సుగమం అయింది.

ఈ నిర్ణయంతో పంకజ్ మిట్టల్ (రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్), సంజయ్ కరోల్ (పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్), పీవీ సంజయ్ కుమార్ (మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్), అహ్సానుద్దీన్ అమానుల్లా (పాట్నా హైకోర్టు న్యాయమూర్తి), మనోజ్ మిశ్రా (అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి) త్వరలోనే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా అడుగుపెట్టనున్నారు. నిజానికి వీరి నియామకం ఎప్పుడో జరగాల్సి ఉండగా కేంద్ర నిర్ణయం పెండింగ్ లో ఉండడంతో ఆలస్యమైంది.

సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 27 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా నియమితులైన వారితో కలిపి జడ్జిల సంఖ్య 32కు చేరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫారసులను కేంద్రం చాలారోజులుగా పెండింగ్‌లో పెట్టింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరపగా.. అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి హాజరై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలిపారు. అయితే కేంద్రం తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నూతన న్యాయమూర్తుల నియామకానికి ఆమోద ముద్ర పడింది.