AP Capital: విశాఖ నుండి పాలన ఫిక్స్?.. ముహూర్తం ఎప్పుడంటే?

Kaburulu

Kaburulu Desk

January 13, 2023 | 05:12 PM

AP Capital: విశాఖ నుండి పాలన ఫిక్స్?.. ముహూర్తం ఎప్పుడంటే?

AP Capital: ఏపీలో మూడు రాజధానుల అంశం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉండగా ఈ నెలాఖరున దీనిపై విచారణ జరగనుంది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు మూడు సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారు. ఈలోగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లును కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకోగా.. అప్పటికే రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో ఆరు నెలల్లో రైతుల దగ్గర తీసుకున్న భూములను అభివృద్ధి చేసి అప్పగించాలని, రాజధానిలోని ఇతర పనులన్నీ పూర్తిచేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆరు నెలల్లో పనులు పూర్తిచేయడం సాధ్యం కాదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో రాజధాని అంశంలో సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందా అని రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కాగా.. ఈ మధ్యనే ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈనెల 31వ తేదీలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.

దీంతో ఈనెల 31న తీర్పు ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠగానే ఉన్నా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెప్తుంది. ఎప్పటికప్పుడు త్వరలోనే పరిపాలన విశాఖకి తరలిస్తామని కూడా మంత్రులే ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఉగాది అనంతరం పరిపాలన విశాఖకు తరలించనున్నట్లు ప్రభుత్వం లీకులిస్తుంది. త్వరలో విశాఖలో రెండు అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు జరగనున్నాయి. అంతర్జాతీయ ఇన్వెస్టర్స్ మీట్.. జీ 20 సన్నాహక సదస్సు జరగనున్నాయి.

ఈ రెండు ఈవెంట్స్ అనంతరం విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభించి.. ఉగాది నాడు అక్కడ నుంచి పరిపాలన ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. కోర్టు కేసు అనుకూలంగా వస్తే సచివాలయాన్ని తరలించనున్నట్లు చెప్తున్నారు. ఒకవేళ కోర్టు కేసు ప్రతికూలంగా వస్తే కనుక క్యాంపు కార్యాలయం నుండి సీఎంగా పరిపాలన చేసేందుకు ఇబ్బంది ఉండదు కనుక అలాగే కొనసాగించాలనే ఆలోచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. మరి ఏపీ రాజధాని విషయంలో ఏం జరగబోతుందన్నది ఆసక్తిగా మారింది.