BJP-BRS: ఎమ్మెల్యేల కొనుగోలుకి ప్రయత్నించిన నందకుమార్ జైలు నుండి విడుదల!

Kaburulu

Kaburulu Desk

January 13, 2023 | 04:20 PM

BJP-BRS: ఎమ్మెల్యేల కొనుగోలుకి ప్రయత్నించిన నందకుమార్ జైలు నుండి విడుదల!

BJP-BRS: తెలంగాణలో హైదరాబాద్ సమీపంలోని మెయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన భేరసారాల వ్యవహారం బట్టబయలై రాజకీయ ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ టిఆర్ఎస్ కు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్, తాండూరు ఎమ్మెల్యేలను కొందరు ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ బేరసారాలలో కీలకవ్యక్తిగా నందకుమార్ ను తేల్చారు. పూజల కోసం మాత్రమే తాము ఫామ్ హౌస్ కు వెళ్లామని నందకుమార్ వాదించిన ఇవేమీ నిలవలేదు.

నందకుమార్ తో పాటు సింహయాజి స్వామీజీ మరో వ్యక్తి కూడా ఈ ఎపిసోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీళ్లంతా బీజేపీ మధ్యవర్తులుగా ఫామ్ హౌస్ కి వెళ్లారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించగా.. టీఆర్ఎస్ కుట్రగా బీజేపీ ఎదురుదాడి చేసింది. ఈ ఘటనపై బీజేపీ హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఫామ్‌హౌజ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని టీఆర్ఎస్ తమకి అనుకూలంగా మలచుకొని మైలేజ్ దక్కించుకోగా బీజేపీ ఎదురుదాడితో ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే, అదంతా అప్పుడు ముగిసిపోగా.. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న నందకుమార్ ఏ2గా చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు. అయితే, శుక్రవారం ఉదయం చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు.

నంద కుమార్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదల అయ్యాక హైదరాబాద్ దాటి వెళ్లొద్దని, అందుబాటులో ఉండాలని సూచించింది. నందకుమార్ పై ఎమ్మెల్యే కొనుగోలు కేసుతో పాటు డెక్కన్ కిచెన్ వ్యాపారం పేరుతో మోసం చేశారని.. ఫిల్మ్ నగర్ లోని ఓ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా లీజుకు ఇచ్చి డబ్బులు తీసుకున్నారనే మరో రెండు కేసులు కూడా ఉన్నాయి. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా పోలీసులు మరో రెండు కేసులు కూడా నమోదు చేశారు.