Medico Preethi: పోరాడి ఓడిన మెడికో ప్రీతి.. రూ.30 లక్షల పరిహారం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

Medico Preethi: వైద్య విద్యార్థిని ప్రీతి మృత్యువుతో పోరాడి ఓడింది. ఐదు రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 9.10 గంటలకు కన్నుమూసింది. సీనియర్ విద్యార్థి వేధింపులు తట్టుకోలేక పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి వరంగల్ ఎంజిఎంలో ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. ముందుగా ఎంజీఎంలో చికిత్స అందించగా అక్కడ నుండి హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స అందించారు. అయితే, ప్రీతి ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు.
వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో పీజీ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఆమె హానికరమైన ఇంజెక్షన్ చేసుకుని బలవన్మరణానికి యత్నించింది. కాగా, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ప్రీతిని కాపాడాలని ప్రత్యేక వైద్య బృందం ఐదురోజులుగా శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
కాగా, ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియోను ప్రకటించింది. సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ప్రకటన చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. ఎవరూ పూడ్చలేని దుఖంలో ప్రీతి కుటుంబం ఉందని.. ప్రీతి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర ఆవేదన, విచారం వ్యక్తం చేశారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారని అన్నారు.
ఇప్పటికే ప్రీతి ఘటనపై విచారణ కొనసాగుతున్నదని, ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. దోషులు ఎంతటి వారైనా చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ చేపట్టాలని విద్యార్థిని తండ్రి డిమాండ్ చేస్తున్నారు. సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని ఆయన వేడుకున్నారు. ప్రీతిని సైఫే హత్య చేశాడని.. ఇది ముమ్మాటికే హత్యేనని చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు.