Hyderabad: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్.. ఈతకెళ్లి నలుగురు మృతి

Kaburulu

Kaburulu Desk

January 16, 2023 | 05:11 PM

Hyderabad: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్.. ఈతకెళ్లి నలుగురు మృతి

Hyderabad: హైదరాబాద్‌ నగరంలో పండగ పూట విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ తార్నాకలోని రూపాలి అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతోనే కుటుంబం బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి కూడా ఉంది.

నాలుగేళ్ళ చిన్నారితో పాటు దంపతులు, మరో మహిళా ఆత్మహత్యకి పాల్పడ్డారు. అపార్ట్‌మెంట్ వాసుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతులంతా చెన్నైకి చెందిన ప్రతాప్‌ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. భార్య, కూతురు, తల్లిని చంపి ప్రతాప్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ముగ్గురిని గొంతు నులిమి చంపిన ప్రతాప్‌.. అనంతరం ఉరి వేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

మృతులు ప్రతాప్‌ (34), సింధూర (32), ఆద్య(4), ప్రతాప్‌ తల్లి రాజతిగా గుర్తించారు. సింధూర హిమాయత్ నగర్ లోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌ మేనేజర్‌ గా పనిచేస్తుండగా.. ప్రతాప్‌ బీఎండబుల్యు కార్‌ షోరూమ్‌లో డిజైన్‌ మేనేజర్‌ గా పనిచేస్తున్నాడు. సింధూర, ప్రతాప్‌ మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నట్లు అపార్ట్ మెంట్ వాసులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా కుటుంబం మొత్తం మరణంతో అపార్ట్మెంట్ లో విషాదఛాయలు నెలకొన్నాయి.

స్థానికుల ఫిర్యాదుతో అపార్ట్మెంట్ వద్దకు వెళ్లిన పోలీసులు నలుగురు కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రతాప్ ముగ్గురిని చంపి తానూ చనిపోయాడా? ఆత్మహత్యల వెనక కారణాలేంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక, మరో ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పండగ పూట సరదాగా ఈతకి వెళ్లి మరో నలుగురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాదకర ఘటన వికారాబాద్‌ జిల్లాలో సోమవారం చోటు చేసుకున్నది. కోట్‌పల్లి ప్రాజెక్టులో మునిగి నలుగురు మృతి చెందారు. మృతులు పూడూరు మండలం మన్నెగూడ వాసులుగా గుర్తించారు. మృతులు లోకేశ్‌, వెంకటేశ్‌, జగదీశ్‌, రాజేశ్‌గా గుర్తించారు.

వెంకటేశ్‌ ఎంబీఏ చేస్తుండగా, రాజేశ్ ప్రైవేటు ఉద్యోగి., లోకేశ్ జూనియర్‌ అసిస్టెంట్‌గా కాగా జగదీశ్‌ వ్యవసాయం చేస్తున్నాడు. పండగ సెలవు కావడంతో అందరు కలిసి సరదాగా ఈత కోసం ప్రాజెక్టులోకి వెళ్లారు. ప్రమాదవశాత్తు లోతులో మునిగి మృతి చెందారు. పండుగ పూట నలుగురు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకున్నది.