NCESS Research: 410 కోట్ల ఏండ్ల నాటి శిలలు.. హైదరాబాద్‌కు 100 కిమీ దూరంలో గుర్తింపు!

NCESS Research: మరో అరుదైన.. పురాతన కాలం నాటి శిలలు బయటపడ్డాయి. అది కూడా ఎలాంటి కఠిన వాతావరణంలోనైనా చెక్కుచెదరని ఖనిజ లవణం జిర్కోన్ శిలలు కావడం దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలోని చిత్రియాల్ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో కొన్ని అత్యంత అరుదైన శిలలను వెలికితీశారు. ఇవి 410 కోట్ల సంవత్సరాల నాటివని గుర్తించారు. ఆ శిలల వయసు రీత్యా భూమి ఏర్పడిన తొలినాళ్ల నాటివని భావిస్తున్నారు.
కోల్ కతాకు చెందిన ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ స్టడీస్ (ఎన్సీఈఎస్ఎస్), జపాన్ కు చెందిన హిరోషిమా యూనివర్సిటీ పరిశోధకులు ఉమ్మడిగా ఈ రీసెర్చ్ లో పాల్గొన్నారు. ఈ రీసెర్చ్ లో అత్యంత అరుదైన శిలలు బయటపడగా.. ఇవి భూమి ఏర్పడిన తొలినాళ్లలో రసాయనిక పరిణామ క్రమం ఎలా ఉండేదన్న అంశాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
భూమి ఏర్పడిన రోజుల్లో వాతావరణం ఎలా ఉండేది?.. భూమిపై తొలి జీవరాసులు ఎలా ఏర్పడ్డాయి? భూమిపై అసలు మనిషి మనుగడ ఎలా మొదలైంది? అనే అంశాలలో కొన్ని ఇప్పటికే మిస్టరీలుగానే ఉన్నాయి. ముఖ్యంగా తొలి 50 కోట్ల సంవత్సరాల్లో వాతావరణం, భూమి స్థితిగతులు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో బయటపడిన ఖనిజ శిలలతో ఆ గుట్టు విప్పే అవకాశం శాస్త్రవేత్తల ముందు నిలిచింది.
ఇక్కడ బయటపడిన శిలల ఆవిష్కరణలకు సంబంధించిన వివరాలు ఇటీవలే ప్రికేంబ్రియన్ రీసెర్చ్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. ఈ జర్నల్ ప్రకారం అత్యంత తీవ్ర ఉష్ణోగ్రత కారణంగా కరిగిన మాగ్మా పదార్థం భూమి పైభాగంలో గట్టిపడినప్పుడు స్ఫటికీకరణ చెందిన మొట్టమొదటి ఖనిజలవణాల్లో జిర్కోన్ ఒకటి. ఇది ఎంతో కఠినమైన ఖనిజ లవణం కాగా రసాయనికంగా స్థిరమైంది. అందుకే వాతావరణ పరిస్థితులు కూడా దీన్ని ఏమీ చేయలేవని చెప్తున్నారు. దీనిపై పరిశోధనల ద్వారా భూమి ఆవిర్భావ మూలాన్ని కనుగొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.