West Bengal: టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌కు వెళ్తున్న బాలిక.. ట్రాఫిక్ ఫ్రీ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిన పోలీసులు

West Bengal: పోలీసులంటే మన సమాజంలో ఒక రకమైన భావన ఉంటుంది. పోలీసులంటే కొడతారు.. తిడతారు.. అనవసర కేసులలో ఇరికించి హింస పెడతారని చాలామంది అనుకుంటుంటారు. అయితే, పోలీసులలో కూడా మంచి వారు, మానవత్వం ఉన్నవాళ్లు ఎందరో ఉన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకొని మేమున్నామంటూ ముందుకొచ్చిన ఎంతోమంది పోలీసులను ఇప్పటికే చూశాం. కాగా.. ఇప్పుడు మనం చెప్పుకొనే పోలీస్ కూడా ఆ కోవకి చెందిన వ్యక్తే.
పశ్చిమ బెంగాల్‌లోని హౌరా బ్రిడ్జ్ సమీపంలో ఓ బాలిక స్కూల్ యూనిఫాంలో ఏడుస్తూ అటువైపు వెళ్తున్న వారిని సాయం కోసం అర్థిస్తోంది. బాలిక ఏడుపుని, అభ్యర్ధనను అటు వెళ్లే వారు పట్టించుకోవడం లేదు. కాగా, అదే సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సౌవిక్ చక్రవర్తి అది చూసి బాలిక వద్దకెళ్లి ఆరా తీశారు. తాను శాయంబజార్‌లోని ఆదర్శ్ శిక్ష నికేతన్‌లో పదో తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్లాలని.. అక్కడికి వెళ్లేందుకు సాయం చేయాలని కోరింది.
దీంతో పోలీసు బాలికను ఇంట్లో వారు ఎవరూ రాలేదా అని ప్రశ్నించాడు. తన తాతయ్య చనిపోయారని, కుటుంబ సభ్యులందరూ అంత్యక్రియల కోసం వెళ్లారని.. పరీక్ష కోసం తాను ఇలా వెళ్తున్నానని చెప్పింది. దీంతో చలించిపోయిన పోలీస్.. బాలికను తన అధికారిక వాహనంలో ఎక్కించుకుని పరీక్ష కేంద్రానికి బయలుదేరారు. అయితే, అప్పటికే ఆలస్యమవడం, పరీక్షకు సమయం దగ్గరపడడం, నగరంలో భారీ ట్రాఫిక్ ఉండడంతో పోలీస్ మరో ప్రత్యామ్నాయం కోసం వెతికారు.
అనుకున్నదే తడవుగా.. వారు వెళ్లే మార్గంలో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ ఆటంకం లేకుండా నిర్ణీత సమయానికి బాలికను పరీక్ష కేంద్రం వద్ద దింపడంతో బాలిక పరీక్ష రాసింది. కోల్‌కతా పోలీసులు ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టు కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.