Earthquake: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను వణికించిన భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

Kaburulu

Kaburulu Desk

March 24, 2023 | 04:00 PM

Earthquake: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను వణికించిన భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

Earthquake: ప్రపంచవ్యాప్తంగా ఇటీవ‌ల కాలంలో భూకంపాలు ఎక్కువ‌గా చోటుచేసుకుంటున్నాయి. ట‌ర్కీ, సిరియాలో వ‌చ్చిన భారీ భూకంపం ఆ దేశాల రూపాన్నే మార్చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా పలు దేశాల్లో భూప్రకంపనలు కనిపించాయి. మన దేశంలో కూడా పలు రాష్ట్రాలలో భూకంపం హడలెత్తించింది. తాజాగా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం వచ్చింది. ఈరోజు (24-03-2023) ఉదయం 10.31 గంటలకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో భూమి కంపించింది.

దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.0గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. గ్వాలియర్‌కు 28 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో కూడా భూమి కంపించింది. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో భూకంపం వచ్చిందని ఎన్‌సీఎస్‌ తెలిపింది. అంబికాపూర్‌లో ఆరు సెకన్ల పాటు భూమి కంపించిందని వెల్లడించగా.. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

రెండు రాష్ట్రాలలో భూకంప ప్రభావంతో ప్రజలు ఇళ్ల‌ నుంచి బయటకు పరుగులు తీశారని పేర్కొంది. కాగా, మంగళవారం రాత్రి అఫ్గానిస్థాన్‌లోని హిందూ కుష్‌ పర్వత శ్రేణుల్లో 6.6 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో భూమికంపించింది. పాకిస్థాన్‌, తుర్కెమినిస్థాన్‌, క‌జ‌కిస్తాన్‌, త‌జ‌కిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, చైనా, కిర్గిస్థాన్ దేశాల్లోనూ భూకంపం సంభ‌వించింది.