Capital Amaravati: ఈనెల 31 లోగా అఫిడవిట్.. అమరావతిపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

Kaburulu

Kaburulu Desk

January 10, 2023 | 03:48 PM

Capital Amaravati: ఈనెల 31 లోగా అఫిడవిట్.. అమరావతిపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఒక్కటే రాజధాని కాకుండా మూడు రాజధానులను ప్రతిపాదించింది. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఉంటాయని ప్రకటించింది. దీనిపై అమరావతి ప్రాంత రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయగా అప్పటి నుండి ఇప్పటికీ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు మూడు సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారు. ఈలోగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లును కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకోగా.. అప్పటికే రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆరు నెలల్లో రైతుల దగ్గర తీసుకున్న భూములను అభివృద్ధి చేసి అప్పగించాలని, రాజధానిలోని ఇతర పనులన్నీ పూర్తిచేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆరు నెలల్లో పనులు పూర్తిచేయడం సాధ్యం కాదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో రాజధాని అంశంలో సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందా అని రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కాగా.. తాజాగా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈనెల 31వ తేదీలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని.. ఇందులో ప్రతివాదులైన రైతులు, వివిధ పార్టీల నేతలు, మంత్రులు, పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది.

ఒకవిధంగా అమరావతి అంశంలో సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్న అంశంపై ఇటు రాష్ట్ర ప్రజలతో పాటు ప్రభుత్వంలో కూడా ఉత్కంఠ కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించాలని సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. రేపో మాపో రాజధాని విశాఖకు తరలిస్తామని సాక్షాత్తు మంత్రులే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే.. మళ్ళీ కొత్త బిల్లు తీసుకురావడం.. రాజధాని తరలింపు సులభమవుతుంది. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే రాజధాని తరలింపుకి ప్రత్యామ్నాయ మార్గాలేమైనా ఉన్నాయా అన్నది చూసుకొనే అవకాశం ఉంటుంది. కానీ, సుప్రీం మళ్ళీ ఈనెల 31 వరకు పొడిగించింది.