TDP vs YSRCP: మహిళా కార్యకర్తల దాడులు.. ఉద్రిక్తంగా మారిన అవినాష్ పర్యటన!

Kaburulu

Kaburulu Desk

January 10, 2023 | 02:00 PM

TDP vs YSRCP: మహిళా కార్యకర్తల దాడులు.. ఉద్రిక్తంగా మారిన అవినాష్ పర్యటన!

TDP vs YSRCP: ఏపీలో ఎక్కడ చూసినా అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, దాడులే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల స్థాయి నేతలేమో ప్రత్యర్థులపై మాటల దాడికి దిగుతుంటే.. కింది స్థాయి కార్యకర్తలు ఏకంగా భౌతిక దాడులకు దిగుతున్నారు. ప్రతిపక్షాలు ఎక్కడ ఎలాంటి కార్యక్రమం చేపట్టినా పోలీసుల అడ్డంకులతో రణరంగంగా మారడం.. ఇటు అధికార పార్టీ కార్యక్రమాలకు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఆటంకాలు కలిగించడంతో ఇక్కడ ఎప్పటికప్పుడు హీట్ పెరుగుతూనే ఉంది.

వైసీపీ నేతలు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే తమ ఇళ్ల వద్దకు, కాలనీలకు వస్తున్న వైసీపీ నేతలను కొందరు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు వ్యతిరేకించడం సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. అయితే.. కొన్ని చోట్ల వైసీపీ కార్యకర్తలు ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగడంతో ఇది కాస్త వివాదంగా మారి కొట్లాటల వరకు వెళ్తుంది. తాజాగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అదే జరిగింది.

ఇక్కడ టీడీపీ నుండి జంప్ అయి వైసీపీ ఇంఛార్జ్ గా ఉన్న దేవినేని అవినాష్ గడప గడపకు కార్యక్రమం చేపట్టారు. అయితే రాణిగారితోట ప్రాంతంలో కార్పొరేటర్ రామిరెడ్డి ఇతర నేతలతో కలిసి దేవినేని అవినాష్ వెళ్తుండగా పలువురు స్థానిక మహిళలు వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కోసం పని చేశాం, మీ వెనుక తిరిగాం, మీరు మాకేం చేశారని నిలదీశారు. కార్పొరేటర్ రామిరెడ్డి తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అయినా అవినాష్ పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగారు.

ఆ తర్వాత రమీజా అనే మహిళ ఇంటిపై టీడీపీ జెండా ఉండటాన్ని గమనించిన అవినాష్.. ఈ జెండా మనం పెట్టిందేనా అని ప్రశ్నించారు. దానికి ఆమె ఔను.. గుడివాడలో మీరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈ జెండాను పెట్టామని చెప్పారు. దీంతో అవినాష్ మౌనంగా ఉండిపోయారు. అయితే.. అక్కడే కొందరు మహిళలు మీ వెంటే తిరిగామని అయినా తమకు మోసం జరిగిందని కార్పొరేటర్‌ను చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, టీడీపీ మహిళలు సమస్యలు సృష్టిస్తున్నారంటూ అక్కడే ఉన్న వైసీపీ మహిళలు గొడవకి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెరిగి బహీబాహీ వరకు వెళ్ళింది. అయితే ఈ ఘర్షణకు టీడీపీ కుట్రే కారణమని దేవినేని అవినాష్ ఆరోపించారు.