Jambukeswarar Temple Thiruvanaikaval: శివుడు జలలింగంగా వెలసిన జంబుకేశ్వర క్షేత్రం విశిష్టత తెలుసా…?

పంచభూత శైవ క్షేత్రాలలో రెండవది జంబుకేశ్వరం. జంబుకేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. జంబుకేశ్వరానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏనుగుల చేత పూజలందుకొన్న క్షేత్రము అని ఈ పేర్లకు అర్థం. పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది. జంబు వృక్షాలంటే తెల్లనేరేడు వృక్షాలు అని అర్థం.
ఇక్కడి దేవాలయం విశాలమైన ప్రాక్రారాలతో ఎత్తైన గోపురాలతో ఉంది. దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో, ఐదు ప్రాకారాలు కలిగి ఉంది. ఆలయానికి మొత్తం ఏడు గోపురాలు ఉన్నాయి. జంబుకేశ్వర స్వామి వారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు. గర్భగుడి ప్రక్కన అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉంది. ఆలయప్రాకారములో జంబుకేశ్వర స్వామి ఆలయం, అఖిలాండేశ్వరి ఆలయమే కాకుండా అనేక ఉపఆలయాలు, అనేక మండపాలు ఉన్నాయి.
జంబుకేశ్వరుడిగా పేరుపొందినప్పటికీ ఇక్కడి లింగం నీటితో నిర్మితమైంది కాని నీటిలో లేదు. లింగం పానపట్టం నుండి ఎల్లకాలము నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానపట్టం పై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి దానిని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది. గర్భగుడిలో గవాక్షానికి “నవద్వార గవాక్షం” అని పేరు. గర్భాలయంలో ఉన్న జంబుకేశ్వరుడినే అప్పులింగేశ్వరుడు, నీర్ తిరళ్‌నాథర్ అని కూడా పిలుస్తారు.