Charmme Kaur : సౌత్ వాళ్ళు కూడా మా సినిమా చూడలేదు.. చాలా బాధగా ఉంది.. లైగర్ రిజల్ట్ పై ఛార్మి రియాక్షన్

Kaburulu

Kaburulu Desk

August 30, 2022 | 01:27 PM

Charmme Kaur : సౌత్ వాళ్ళు కూడా మా సినిమా చూడలేదు.. చాలా బాధగా ఉంది.. లైగర్ రిజల్ట్ పై ఛార్మి రియాక్షన్

Charmme Kaur :  విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా తెరకెక్కిన సినిమా లైగర్. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాధ్ కలిసి నిర్మించారు. రిలీజ్ కి ముందు ఈ సినిమాకి భారీ హైప్ ని తీసుకొచ్చారు చిత్ర యూనిట్. విజయ్ దేవరకొండ అయితే ఈ సినిమాతో ఇండియాని షేక్ చేస్తాం, 200 కోట్లు కలెక్షన్స్ వస్తాయి అంటూ ఎక్కడ లేని మాటలన్నీ చెప్పాడు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఫలితం మాత్రం చాలా దారుణంగా ఉంది.

సాధారణ ప్రేక్షకులే కాక, అభిమానులు కూడా ఇదేమి సినిమారా బాబు అని కామెంట్స్ చేశారు. బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పిన సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక కలెక్షన్స్ అయితే మరీ దారుణం. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఇటు విజయ్, పూరీలతో పాటు అటు కరణ్ జోహార్ ని కూడా తిట్టడం మొదలుపెట్టారు. సినిమాపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఇటీవల అందరూ తెలుగు సినిమా తీసి బాలీవుడ్ లో రిలీజ్ చేసి సక్సెస్ కొడుతుంటే వీళ్ళేమో హెచ్చుకి పోయి బాలీవుడ్ లో సినిమా తీసి తెలుగులో రిలీజ్ చేసి మనకి వచ్చిన మంచిపేరుని కూడా పోగొట్టారు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

అయితే లైగర్ సినిమా ఫలితం ఇంత తేడాగా ఉన్నా చిత్రయూనిట్ మాత్రం సూపర్ హిట్ అని పోస్టర్స్ వేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా ఫలితం మీద స్పందించని ఛార్మి తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ లైగర్ రిజల్ట్ పై మాట్లాడినట్టు సమాచారం. ఛార్మి మాట్లాడుతూ.. ”ఇటీవల ప్రేక్షకులు థియేటర్ కి రావడం మానేశారు. వాళ్ళని థియేటర్ కి వచ్చేలా మనం చేయాలి. ప్రేక్షకులు అంతా ఓటీటీకి అలవాటు పడ్డారు. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధించి బాగా మార్కెట్ చేశాయి. మా సినిమా కూడా బాగా కలెక్ట్ చేస్తుంది అనుకున్నాం. కానీ జనాలు థియేటర్స్ కి ఎందుకు రావట్లేదో అర్ధం కాలేదు. అసలు సౌత్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి రావట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం” అని ఎమోషనల్ గా చెప్పింది.

అయితే ఛార్మి తమ సినిమాలో మైనస్ లు పెట్టుకొని ప్రేక్షకులు థియేటర్లకు రావడంలేదు, సౌత్ వాళ్ళు కూడా చూడట్లేదు అనడంతో మరోసారి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా లైగర్ సినిమా ఫలితం మాత్రం విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ లని బాగా డిస్టర్బ్ చేసినట్టు తెలుస్తుంది.