Samatha Kumbh 2023: ఐదో రోజు అంగరంగ వైభవంగా శ్రీ రామానుజాచార్య సమతా కుంభ్ ఉత్సవాలు…!

Kaburulu

Kaburulu Desk

February 7, 2023 | 09:53 PM

Samatha Kumbh 2023: ఐదో రోజు అంగరంగ వైభవంగా శ్రీ రామానుజాచార్య సమతా కుంభ్ ఉత్సవాలు…!

హైదరాబాద్ కు దగ్గరలో గల ముచ్చింతల్‌లోని సమతా స్ఫూర్తి ప్రాంగణంలో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి సారథ్యంలో నిత్య కైంకర్యాలు, విశిష్ట వాహన సేవలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐదో రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. నిత్య కార్యక్రమాలు కొనసాగాయి.

ఉదయం 5 గంటల 45 నిమిషాలకు స్వామివారికి సుప్రభాత సేవ జరిగింది. అనంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ ఆధ్వర్యంలో అష్టాక్షరీ మంత్రజపం జరిగింది. భక్తులంతా అరగంటపాటు ధ్యానం చేశారు. ఆ తర్వాత ఆరాధన, సేవాకాలంలో భాగంగా శాత్తుముఱై జరిపించారు. అనంతరం తీర్థ, ప్రసాద గోష్టిలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా చినజీయర్‌ స్వామివారు తీర్థం అనుగ్రహించారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు పూర్ణాహుతి, బలిహరణ జరిగింది.

సాయంత్రం శ్రీవిష్ణు సహస్రనామస్తోత్ర సామూహిక పారాయణం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది.  త్రిదండి చిన్నజీయర్‌స్వామి కూచిపూడి నృత్య బృందానికి మంగళ శాసనాలు అందించారు. ఆ తర్వాత సాకేత రామచంద్ర ప్రభువుకు గరుడ సేవతో పాటు 18 దివ్యదేశాధీశులకు గరుడ సేవలు నిర్వహించారు. అనంతరం నిత్యాపూర్ణాహుతి నిర్వహించారు. తిరువీధి సేవ, మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఐదో రోజు సమతా కుంభ్‌ కార్యక్రమాలు ముగిశాయి.