Samatha Kumbh: అట్టహాసంగా జరిగిన సమతామూర్తి సమతా కుంభ్ తెప్పోత్సవం…! జరిగిన కార్యక్రమాలు ఏమిటో తెలుసా..?

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు ఏడో రోజు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా.. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. 14వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ రోజు ఏ యే కార్యక్రమాలు జరిగాయో ఇపుడు తెలుసుకుందాం…!
ముచ్చింతల్‌లో సమతా కుంభ్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల నిత్య కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడో రోజు కల్హారోత్సవం వైభవంగా సాగింది. సమతామూర్తి సన్నిధిలో భక్తజనం ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం సామూహిక పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. 18 దివ్యదేశాధీశులకు 18 రూపాలలో తెప్పోత్సవం నిర్వహించారు.
సమతా కుంభ్ 2023 బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ త్రిడండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో తెప్పోత్సవం కనుల పండుగగా సాగింది. శ్రీ భగవత్ రామానుజ, పరమహంస స్వరూపుల ఒడిలో సాకేత రామచంద్రప్రభువుతో పాటు 18 దివ్యదేశాల మూర్తులను ఆహ్వానించి ఉత్సవం జరిపించారు. కన్నుల విందుగా కనిపించే ఈ దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు.