Medico Preethi Case: మెడికో ప్రీతికి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్.. విషమించిన పరిస్థితి!

Medico Preethi Case: సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి యత్నించిన వరంగల్ కేఎంసీ పీజీ మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రీతికి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా.. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయినట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. మరోవైపు ప్రీతిని వేధింపులకు గురిచేసిన సీనియర్ విద్యార్థిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ర్యాగింగ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు.
కాగా, ఈ కేసులో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గవర్నర్ తమిళి సై సైతం వెళ్లారు. అక్కడ ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. వైద్య విద్యార్థినికి ఇలా జరగడం దురదృష్టకరమన్నారు.
హైదరాబాద్‌లో రైల్వే పోలీస్ ఎస్సైగా పనిచేస్తున్న నరేందర్ కూతురు ప్రీతి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్నారు.. మూడు నెలల క్రితం కేఎంసీలో చేరిన ప్రీతి వరంగల్ ఎంజీఎంలో విధులు నిర్వహిస్తుండగా.. గత నెల నుండి ఆమెకు సీనియర్‌గా ఉన్న సైఫ్ అనే విద్యార్ధి ఆమెను తీవ్రంగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పుకుని బాధపడింది. కాలేజీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీనియర్లు హెచ్చరించడంతో ప్రీతి మనస్థాపానికి గురైంది.
ప్రీతి తండ్రి నరేందర్ విషయం అధికారుల దృ ష్టికి తీసుకెళ్లడంతో సీనియర్ని
మందలించి ఇద్దరికి వేరు వేరు చోట విధులు కేటాయించగా.. నిన్న రాత్రి నైట్ డ్యూటీ చేస్తున్న ప్రీతి తెల్లవారు జాము వరకు బాగానే ఉండగా ఉదయం 6 గంటల సమయంలో డాక్టర్స్ రూమ్ లో అపస్మారక స్థితిలో ప్రీతి ఉండడాన్ని గుర్తించి తోటి వైద్య విద్యార్థులు అధికారులను అప్రమత్తం చేసి హుటాహుటిన చికిత్స అందించారు. అయితే, అప్పటికే కార్డియాక్ అరెస్ట్, లంగ్ ఫెయిల్యూర్ వంటి సమస్యలను గుర్తించారు.